లడ్డూల నష్టానికి బాధ్యులు ఎవరు?

4 Oct, 2016 11:33 IST|Sakshi
లడ్డూల నష్టానికి బాధ్యులు ఎవరు?

ఎవరి తప్పులేదంటున్న  ఈవో సూర్యకుమారి
విచారణలు, చర్యలు లేనట్టేనా?
 
సాక్షి, విజయవాడ: ‘ఎదురుగా ఈగల్ని పోనివ్వరు... వెనుక నుంచి ఏనుగులు పోతాయి’ అన్నట్టు ఉంది ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికారుల పనితీరు. దేవస్థానానికి ఆదాయం పెంచడం కోసం భక్తుల దర్శనం టికెట్లు, పూజా టికెట్లు పెంచేసిన ఈవో సూర్యకుమారి వెనుకవైపు దేవస్థానానికి లక్షల్లో వస్తున్న నష్టాల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

గతంలో రూ.100 ఉన్న దర్శనం టికెట్ ఇప్పుడు రూ.300, రూ.500కు పెంచేశారు. దీనివల్ల భక్తులు అమ్మవారికి దూరం అవుతున్నారే తప్ప దేవస్థానానికి పెద్దగా ఒరుగుతున్నది ఏమీ లేదు. అలాగే కుంకుమ పూజా టికెట్లు, చండీహోమం టికెట్ల రేట్లను పెంచేశారు. దీనివల్ల దేవస్థానానికి లక్షల్లో ఆదాయం వచ్చిందా అంటే..అదీ లేదు. ఇక వరలక్ష్మి వత్రం లాంటి పూజలకు టికెట్లు పెట్టి పేద, మధ్యతరగతి వర్గాల మహిళా భక్తుల్ని అమ్మవారి సన్నిధికి రాకుండా దూరం చేశారు.


ఒక్క లడ్డూల్లోనే రూ.4లక్షలు నష్టం
దుర్గగుడిలో సుమారు 41వేల లడ్డూలు పాడైపోవడంతో వాటిని విక్రయించకుండా పక్కన పెట్టేయాలని దేవస్థానం కార్యనిర్వహణధికారి సూర్యకుమారి నిర్ణయించారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే లడ్డూలు పాడైపోయాయని, అందువల్ల దీనికి ఎవరూ బాధ్యులు కారని ఈవో తేల్చి చెప్పారు. దీనివల్ల దేవస్థానానికి ఏకంగా రూ.4లక్షల వరకు నష్టం వస్తోంది. ఒకవైపు భక్తుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తూ.. మరోకవైపు ఈ విధంగా వృథా చేయడాన్ని భక్తులు ప్రశ్నిస్తున్నారు.


 గతంలో ఏం జరిగిందంటే....
 గతంలో భక్తుల దర్శనం టిక్కెట్లు పెంచాలంటే ఈవోలు ఆచితూచి నిర్ణయాలు తీసుకునేవారు. అయితే లడ్డూలు పాడైపోవడం వంటి సంఘటనలు జరిగితే  మాత్రం కఠినంగా వుండేవారు. గతంలో 100 లడ్డూలు పాడైపోయాయని ఒక ఉద్యోగిని సస్పెండ్‌చేశారు. మరొక సందర్భంగా 900 లడ్డూలు పాడైపోయాయని విజిలెన్స్ అధికారులు సూమోటోగా విచారణ చేసి నివేదిక ఇచ్చారు.

చివరకు ఈ లడ్డూలు పాడైందుకు కారణమైన సూపరింటెండెంట్, గుమస్తాలు ఆ తప్పుకు బాధ్యత వహిస్తూ నష్టాన్ని వారు జీతాల నుంచి చెల్లించారు. ఇప్పుడు ఏకంగా 41వేల లడ్డూలు పాడైపోతే కనీసం ఆవిభాగానికి చెందిన సిబ్బంది వివరణ తీసుకుంటామని కూడా ఈవో చెప్పకపోవడం విశేషం. దేవస్థానంలో ఒక ఏపీఓ స్థాయి అధికారి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ప్రసాదాలను ఇబ్బడి ముబ్బడిగా తయారు చేయించడం వల్లనే పాడైపోయాయనే విమర్శలు వినవస్తున్నాయి.

మరిన్ని వార్తలు