దేశంలో అంతర్జాతీయ స్టార్ హోటళ్లు

19 Dec, 2013 02:24 IST|Sakshi

చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మరిన్ని స్టార్ హోటళ్లను ప్రారంభించనున్నట్లు ఇంటర్నేషనల్ హోటల్స్ గ్రూప్ (భారత్, మిడిల్‌ఈస్ట్, ఆఫ్రికా) సీఈవో పాస్కల్ గోవిన్ తెలిపారు. చెన్నై సమీపంలోని మహీంద్రా వర ల్డ్‌సిటీలో హాలిడే ఇన్ ఎక్స్‌ప్రెస్ స్టార్ హోటల్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోవిన్ మాట్లాడుతూ, 1991 నుంచి ఇప్పటి వరకు తమ బ్రాండ్‌పై ప్రపంచ వ్యాప్తంగా 2,235 హోటళ్లు నిర్మించినట్లు తెలిపారు. భారత్‌తోపాటూ విదేశాల్లో మరో 18 హాలిడేఇన్ హోటళ్లు రానున్నాయని తెలిపారు.

 డ్యూయట్ గ్రూపు హోటళ్ల పరిధిలో నిర్మించిన ఈ హాలిడేఇన్ భవిష్యత్తులో భారత్‌లోనే ఒక బ్రాండుగా మారగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న భారత్‌లో హోటళ్ల పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన వాణిజ్య, వ్యాపార ప్రముఖులను దృష్టిలో ఉంచుకుని హోటళ్లలో వసతులు కల్పించడం తమ ప్రత్యేకతగా ఆయన చెప్పారు. డ్యూయెట్ ఇండియా హోటల్స్ ప్రెసిడెంట్ నవీన్‌జైన్ మాట్లాడుతూ, దక్షిణ భారతావనిలోనే కమర్షియల్ హబ్‌గా పేరుగాంచిన చెన్నైలోని ఈ హోటల్‌కు ఉజ్వలభవిష్యత్తు ఉందని భావిస్తున్నామని అన్నారు.

డ్యూయట్ హోటల్స్ కంట్రీహెడ్ సౌరభ్ సొంతాలియా మాట్లాడుతూ, దేశంలోనే ఇది రెండో ప్రాజెక్టని తెలిపారు. దేశ, విదేశాల నుంచి వచ్చే వ్యాపార, పారిశ్రామిక వేత్తలను దృష్టిలో ఉంచుకుని చెన్నైని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో ఉపాధి అవకాశాలు ఎక్కువని గుర్తించినందునే హోటల్ ఆవశ్యకత ఉందని ఇంటెగ్రేటెడ్ సిటీస్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్, మహేంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ సీఈవో సంగీతా ప్రసాద్ అన్నారు.

>
మరిన్ని వార్తలు