ఐటీ దాడులపై స్పందించిన సిద్ధరామయ్య

2 Aug, 2017 13:13 IST|Sakshi
ఐటీ దాడులపై స్పందించిన సిద్ధరామయ్య

బెంగళూరు : ఐటీ దాడులపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. తమ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆయన ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. కనీసం స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదని, తమను బదనాం చేసేందుకే దాడులు చేశారని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

కాగా కర్ణాటక విద్యుత్‌ శాఖ మంత్రి శివకుమార్‌, ఎంపీ డీకే సురేశ్‌ నివాసాలపై ఐటీ శాఖ అధికారులు బుధవారం ఉదయం దాడులు చేసిన విషయం తెలిసిందే. అలాగే శివకుమార్‌, సురేశ్‌ సోదరులు, బంధువుల ఇళ్లతో పాటు గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బసచేసిన ఈగల్‌ టన్‌ రిసార్ట్‌లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 39 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు చేపట్టారు. కాగా ఐటీ సోదాల్లో సుమారు 7.5 కోట్ల నగదు పట్టుబడినట్లు సమాచారం.

ఐటీ దాడుల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ...కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఫోన్‌ చేసి, తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఇదే అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యులు నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందంటూ ధ్వజమెత్తారు. అయితే కాంగ్రెస్‌ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది.

మరిన్ని వార్తలు