పార్టీల ప్రచారమంతా ‘ఆమె’ చుట్టూనే..!

2 Feb, 2015 22:21 IST|Sakshi

న్యూఢిల్లీ: మహిళా భద్రత...ప్రస్తుత విధానసభ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారింది. బరిలోకి దిగిన మహిళా అభ్యర్థులంతా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ హామీలు గుప్పిస్తున్నారు. తమను గెలిపిస్తే బస్సులు, మెట్రో రైళ్ల వంటి ప్రజా రవాణా ప్రదేశాల్లో మార్షల్స్‌ను ఏర్పాటు చేస్తామని, సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచుతామని వాగ్దానాలిస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మహిళలతో ఎలా ప్రవర్తించాలనే దానిపై మగవాళ్లకు శిక్షణ కూడా ఇప్పిస్తామంటున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ మాజీ ఐపీఎస్ అధికారి కూడా కావడంతో ఆ పార్టీ తమకు అధికారమిస్తే రాజధానిలో మహిళా భద్రతను మెరుగుపరుస్తామని చెప్తోంది. ఈ విధంగా అన్ని పార్టీలు ఇబ్బడి ముబ్బడిగా హామీలిస్తూప్రజలకు అర చేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.
 
 రేప్ కేపిటల్‌గా మారిన రాజధాని
 గత కొన్నేళ్లుగా దేశ రాజధానిలో మహిళలకు భద్రత కొరవడింది. వారికి రక్షణ కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫమవడంతో జాతీయ రాజధాని... ‘రేప్ కేపిటల్’ అనే అపఖ్యాతిని మూటగట్టుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేస్తున్న 673 మందిలో మహిళలు కేవలం 19 మంది మాత్రమే ఉన్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్ కూడా చాలా తక్కువ మంది మహిళలకు పోటీ చేసే అవకాశమిచ్చాయి. మొత్తం 70 స్థానాలు ఉండగా, బీజేపీ తరఫున ఎనిమిదిమంది, ఆప్ తరఫున ఆరుగురు, కాంగ్రెస్ తరఫున ఐదుగురు ఎన్నికల బరిలో నిలిచారు. నగరంలో మొత్తం ఓటర్లు సుమారు కోటి 30 లక్షలు కాగా అందులో మహిళా ఓటర్లు 50 లక్షల తొంభై వేల మంది.
 
 కీలకమైన అంశం
 ‘ మహిళా భద్రత అనేది కీలకమైన అంశం. లింగ నిష్పత్తి తగ్గుముఖం పట్టడం, సాంఘిక దురాచారాలైన వరకట్నం లాంటివి మహిళలపై వేధింపులకు మూల కారణాలు. నేను మంత్రిగా ఉన్న సమయంలో అబ్బాయిలకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ‘సాక్షం’ అనే పథకాన్ని ప్రారంభించా. అదే పథకాన్ని ఢిల్లీలో కూడా అమలు చేయాలని కోరుతున్నా. ఒకసారి దీని గురించి అవగాహన కల్పిస్తే పరిస్థితుల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి’
 
 -  కృష్ణతీరథ్ (పటేల్‌నగర్ బీజేపీ అభ్యర్థి)
  చట్టాలను సరిగ్గా అమలు చేయాలి
 ‘మహిళల కోసం చేసిన చట్టాలను సరిగా అమలు చేయాలి. విచారణను వేగవంతం చేయాలి. నగరం మొత్తం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అవకాశమిస్తే మహిళ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం’
 - రజనీ అబ్బీ (తిమర్‌పూర్ బీజేపీ అభ్యర్థి)
 
 భద్రతా సిబ్బంది సంఖ్య పెంచాలి
 భద్రతా సిబ్బంది సంఖ్య పెంచాలి. బహిరంగ ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి, మాకు అవకాశమిస్తే మహిళా భద్రత కోసం హోం గార్డుల సంఖ్యను పెంచుతాం. క్యాబ్‌లలో ప్రయాణించే మహిళల భద్రత కోసం డ్రైవర్లకు ఫోన్ చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షించేలా చూస్తాం.’
 - శర్మిష్టా ముఖర్జీ, గ్రేటర్ కైలాశ్ కాంగ్రెస్ అభ్యర్థి
 
 అనేక పథకాలు తెచ్చాం
 ‘ మహిళల భద్రత కోసం గత 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక ముఖ్యమైన పథకాలను తీసుకొచ్చాం. కానీ 49 రోజుల ఆప్ పాలనలో వాటన్నింటినీ గాలికొదిలేశారు’. - కిరణ్ వాలియా, ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ మాజీ మంత్రి
 మార్షల్స్‌ను నియమిస్తాం
 ‘మేమే మహిళా భద్రత అంశం నుంచి ఎప్పుడూ పక్కకు వెళ్లలేదు. మాకు అవకాశమిస్తే 10,000 మందితో ప్రత్యేక మహిళా దళం ఏర్పాటు చేస్తాం. మెరుగైన భద్రత కల్పించేందుకు ప్రజా రవాణా ప్రాంతాల్లో మార్షల్స్‌ను నియమిస్తాం.’  - బందనా కుమారి,
 షాలిమార్ ఆప్ అభ్యర్థి
 

whatsapp channel

మరిన్ని వార్తలు