గ్రానైట్ స్కాంలో అధికారులు

6 Dec, 2014 03:09 IST|Sakshi
గ్రానైట్ స్కాంలో అధికారులు

- విచారణకు పట్టు
- సహాయంకు భద్రత పెంపు

సాక్షి, చెన్నై : గ్రానైట్ స్కాంలో మదురై కేంద్రంగా గతం లో పనిచేసిన అధికారులు, రిటైర్డ్ అధికారుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు బయలు దేరాయి. వారందర్నీ విచారించాల్సిందేనని సహాయం కమిటీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక, సహాయం కమిటీ రహస్య విచారణలకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు బయటకు పొక్కుతున్నట్టు అనుమానాలు ఉన్నారుు. ఈ నేపథ్యంలో సహాయంకు భద్రతను పెంచారు. మదురై కేంద్రంగా సాగిన గ్రానైట్ స్కాం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైకోర్టు ఆదేశాల మేరకు వేల కోట్ల స్కాంలోని తిమింగళాల భరతం పట్టడం, ప్రభుత్వానికి గండి పడ్డ ఆదాయాన్ని కక్కించడం లక్ష్యంగా ఐఏఎస్ సహాయం కమిటీ రంగంలోకి దిగింది. ఈ కమిటీ తన విచారణను వేగవంతం చేసింది. మదురైలో తిష్ట వేసి ఉన్న సహాయంకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రాంతాల్లో అంటే తమ ప్రాంతాల్లో భారీగా గ్రానైట్ తవ్వకాల రూపంలో నష్టాలు జరిగినట్టు బాధితులు తీవ్ర ఆవేదనతో ఫిర్యాదుల్ని అందజేస్తూ వస్తున్నారు.

శుక్రవారం వామపక్షాల నేతృత్వంలో పలువురు సహాయంకు వినతి పత్రం అందజేశారు. ఈ వేల కోట్ల స్కాంలో అధికారుల హస్తం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశా రు. గతంలో మదురై కేంద్రంగా పనిచేసి బదిలీ మీద మరో చోట పనిచేస్తున్న అధికారులు, రిటైర్డ్ అధికారుల ప్రమేయం తప్పకుండా ఉండి ఉంటుందని ఆరోపించారు. అధికారుల అండదండలతోనే ఈ స్కాం సాగి ఉంటుందని, వారిని సైతం విచారించాలని ఆ కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఇక, బాధితులు, ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల్ని స్వీకరించిన సహాయం, వారి వాదనల్ని రహస్యంగా నమోదు చేసుకునే పనిలో పడ్డారు.
 
భద్రత పెంపు
ఐఏఎస్ అధికారి సహాయం నిక్కచ్చితనానికి మారు పేరు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి నందుకు గాను అనేక బదిలీ ఉత్తర్వుల్ని అందుకుని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వేల కోట్ల స్కాం విచారణ ఆయనకు అప్పగించడంతో దాని వెనుక ఉన్న బడబాబులు, రాజకీయ నాయకుల్లో గుబులు పట్టుకుంది. ఆయన విచారణ ఏ విధంగా సాగుతున్నదో, ఆయన్ను ఎవరెవరు కలుస్తున్నారో, ఆయనకు ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయోనన్న వివరాలు బయటకు పొక్కుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. సహాయంకు తెలి యకుండా అదృశ్య శక్తులు ఎవ్వరో ఆయన విచారణ శైలిని పసిగట్టే పనిలో పడ్డట్టు ఆరోపణలు బయలు దేరాయి. ఎవరో కొందరు ఆయన విచారణను టాంపరింగ్ చేసి పెద్ద చేపలకు అందజేస్తున్నట్టు అనుమానాలు బయలు దేరాయి. దీంతో సహాయం భద్రతపై  ఆందోళన నెలకొంది. ఆయన విచారణ లీక్ కాని రీతి లో, ఆయనకు ఎలాంటి ప్రమాదం తలెత్తని విధంగా గట్టి భద్రతను కల్పించారు. ఇద్దరు గన్‌మెన్‌లు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు కానిస్టేబుళ్లను ఆయ న భద్రతకు రంగంలోకి దించి ఉన్నారు.
 
మరో కేసు
ఓ వైపు సహాయం కమిటీ విచారణ సాగిస్తుంటే, మరో వైపు మరో గ్రానైట్ మోసానికి సంబంధించిన మదురై మేలూరు సమీపంలోని కీల్ వలపు పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణగిరికి చెందిన రాజా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. గ్రానైట్ పాలిషింగ్ పేరిట కీల్ వలపులో ఓ ప్రైవేటు సంస్థ చాప కింద నీరులా గ్రానైట్ తవ్వకాలు సాగుతున్నట్టుగా ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.  అలాగే, రాజా మదురై హైకోర్టును సైతం ఆశ్రయించారు. అప్పుడు స్పందించని పోలీసులు సహాయం కమిటీ రంగంలోకి దిగడంతో ఉరకలు తీస్తూ కేసులు పెట్టడం గమనార్హం.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా