ఆ ఐఏఎస్ నిజాయితీకి బదిలీ బహుమానం

11 Aug, 2016 12:12 IST|Sakshi
ఆ ఐఏఎస్ నిజాయితీకి బదిలీ బహుమానం

మైసూరు జిల్లా కలెక్టర్ సి.శిఖాపై బదిలీ వేటు
 
 
బెంగళూరు: నిజాయితీగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారిపై బదిలీ వేటు పడింది. విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించిన మైసూరు జిల్లా కలెక్టర్ సి. శిఖాను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఆమెను సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జూలై 3న విధి నిర్వహణలో ఉన్న కలెక్టర్ శిఖాపై సీఎం సిద్ధరామయ్యకు ఆప్తుడైన మైసూరు జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షుడు మరిగౌడ దుర్భాషలాడారు, బెదిరింపులకు పాల్పడ్డారు.
 
అదే రోజున కలెక్టర్ శిఖా మైసూరులోని నజర్‌బాద్ పోలీస్‌స్టేషన్‌లో మరిగౌడపై ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణకు అడ్డుపడడంతో పాటు  బెదిరింపులకు దిగారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూలై 3 నుంచి ఆగస్టు 3 వరకు నెల రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మరిగౌడ, కోర్టు జామీను ఇచ్చేందుకు నిరాకరించడంతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. సీఎం ఆప్తుడిపై ఫిర్యాదు చేసినందుకే ఈ బదిలీ చోటు చేసుకుందని ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
త్వరలో మైసూరు దసరా ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో కలెక్టర్ శిఖాను బదిలీ చేయడం సరైన నిర్ణయం కాదన్న విమర్శలు ప్రజల నుంచి  వినిపిస్తున్నాయి. కాగా, మండ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్న శిఖా భర్త డాక్టర్ ఎం.ఎన్.అజయ్ నాగభూషణ్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా నాగభూషణ్‌ను బదిలీ చేసింది. వీరిద్దరితో పాటు ఐఏఎస్ అధికారులు ఎం.వి.సావిత్రి, మనోజ్ జైన్, డి.రణ్‌దీప్, ఖుష్బూగోయల్ చౌదరి, రమణ్‌దీప్ చౌదరి, హెచ్.ఆర్.మహదేవ్, ఎస్.జియాఉల్లా, కె.బి.శివకుమార్, ఎం.జి.హీరేమఠ్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు