ఘనంగా నాగుల పంచమి

12 Aug, 2013 01:04 IST|Sakshi


 సాక్షి, ముంబై: నగరంలో ఆదివారం తెలుగు ప్రజలు నాగపంచమి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి నాగ దేవతకు పాలు పోసేందుకు భక్తులు ఆలయాల బయట బారులు తీరారు. దీంతో మందిరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా సోదరుల కళ్లు పాలతో కడిగేందుకు పెళ్లైన అక్కా, చెల్లెళ్లు పుట్టింటికి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజు పాలతో కళ్లు కడిగితే మంచిగా కనబడతాయని, దృష్టిలోపం ఉండదని ప్రగాఢ నమ్మకం. దీంతో తెలుగు ప్రజలు నివాసముంటున్న చాల్స్, భవనాలు ఇలా ఎక్కడ, ఏ ఇంట్లో చూసినా తోబుట్టువులు పుట్టింటికి వచ్చిన దృశ్యాలే దర్శనమిచ్చాయి. నగరంలో ముఖ్యంగా లోయర్‌పరేల్‌లోని ఏ టు జెడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న నాగ దేవత మందిరానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వర్షం వచ్చే సూచనలు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా చిన్నారులు, ఆడపడుచులతోపాటు వృద్ద మహిళలు కూడా క్యూలో ఎంతో ఓపిగ్గా నిలబడి నాగదేవతను దర్శించుకున్నారు. తోపులాటలు జరగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రస్తుతం శ్రావణ మాస ఉపవాస రోజుల్లో  నాగపంచమి పర్వదినం కలిసిరావడంతో ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా కనిపించాయి.
 
 శిరాలలో నాగదేవతకు పూజలు..
 సాంగ్లీ జిల్లా బత్తిస్(32) శిరాల గ్రామంలో నాగ పంచమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సాంగ్లీ నుంచి సుమారు 60 కిలోమీటర్లు, కొల్హాపూర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శిరాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. 2002 అనంతరం ఇక్కడ సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ  జీవం ఉన్న సర్పాలతో నాగుల పంచమి ఉత్సవాలు నిర్వహించారు. శిరాలలో సర్పాన్ని గ్రామదేవతగా కొలుస్తారు. ముఖ్యంగా నాగులపంచమికి ప్రతి ఇంట్లో నాగదేవతలకు పూజిస్తారు. ఉత్సవాలలో భాగంగా సర్పాలతో అనేక పోటీలు నిర్వహిస్తారు. తర్వాత ఊరేగిస్తారు. అయితే వన్యప్రాణి ప్రేమికుల నిరసనల నేపథ్యంలో దశాబ్దం కిందట సర్పాల పోటీలు, ఊరేగింపులపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఈ నిషేధాన్ని కోర్టు తాత్కాలికంగా ఎత్తివేయడంతో ఇక్కడ ఆదివారం పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగాయి. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాగా, ఈ ఉత్సవాల కోసం పట్టుకున్న పాములను పూజల అనంతరం తిరిగి సురక్షితంగా విడిచిపెట్టేయడం విశేషం

మరిన్ని వార్తలు