నానోకు ఏటా నిధులు

6 Dec, 2013 02:42 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సామాజిక సమస్యల పరిష్కారంతో పాటు జీవన నాణ్యతను మెరుగు పరచే క్రమంలో నానోసైన్స్, నానోటెక్నాలజీలను ఏటా నిర్ణీత నిధులతో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భారత రత్న అవార్డు విజేత ప్రొఫెసర్ సీఎన్‌ఆర్. రావు సూచించారు. నానో అనేది పరమాణువు శాస్త్రీయ కొలమానమని, మనిషి శిరోజం కంటే 50 వేల వంతులు చిన్నదిగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇక్కడి అశోకా హోటల్‌లో గురువారం ప్రారంభమైన ‘ఆరో బెంగళూరు ఇండియా నానో’లో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తు సైన్స్‌గా విభిన్న రంగాల్లో ప్రజలకు ప్రయోజనాలను అందించే సామర్థ్యం నానో టెక్నాలజీకి ఉందని తెలిపారు. నానో గొప్పదనాన్ని ఆయన వివరిస్తూ, ‘ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు నానో ముక్కును అభివృద్ధి పరిచారు. ఈ ముక్కు ద్వారా తుమ్మితే కేన్సర్ రోగిలోని కేన్సర్ అణువులు బయట పడతాయి’ అని వివరించారు.
 
నానో పార్కు

 రాష్ర్టంలో నానా టెక్నాలజీ అభివృద్ధికి నానో పార్కును స్థాపించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరు ఇండియా నానోను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ, నానో టెక్నాలజీ అభివృద్ధికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలను కల్పిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన సీఎన్‌ఆర్. రావును ఇండియా నానో సైన్స్-2013 పురస్కారంతో సత్కరించారు.
 

మరిన్ని వార్తలు