తెలంగాణ సంస్కృతి చాటి చెప్పాం

23 Nov, 2014 23:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ఢిల్లీ ప్రగతిమైదాన్‌లో నిర్విహ స్తున్న ట్రేడ్ ఫెయిర్ ఓ వేదికగా నిలుస్తోందని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డా. వేణుగోపాలాచారి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టే ఈ ట్రేడ్ ఫెయిర్‌లో తెలంగాణ పెవిలి యన్‌కు అశేష ఆదరణ లభిస్తోందన్నారు. ట్రేడ్ ఫెయిర్‌లో భాగంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలను ప్రగతిమైదాన్ లాల్‌చౌక్ థియేటర్‌లో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమాలకు వేణుగోపాలచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో అనువైన పరిస్థితులున్నాయని, సింగిల్‌విండో పద్దతిలో కావాల్సిన అనుమతులు వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుంటున్నారని వివరించారు.
 
 తెలంగాణ కళారూపాలకు వందల ఏళ్లనాటి చరిత్ర ఉందని వివరించారు. పేరిణినాట్యం ఎంతో గొప్పదన్నారు.  ఈ సందర్భగా కళాకారులు ప్రదర్శించిన పేరిణి నాట్యం అలరించింది. కళాకృష్ణ నేతృత్వంలో లయబద్దంగా కళాకారులు శ్రీధర్, వెంకట్, రమాదేవి, జయప్రద, పావనిలు అలరించారు. అనంతరం నిర్వహించిన ఖవ్వాలీకి అనూహ్య స్పందన లభించింది. ఉత్తరాదికి చెందిన పలువురు హైదరాబాదీ వార్సి సోదరుల ఖవ్వాలీకి మంత్రముగ్ధులయ్యారు. జనాబ్‌జీ మహబూబ్, జబ్బార్, అజిత్‌ఖాన్,సబీ తదితరులు అలరించారు. కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్‌కుమార్ నాయక్, తెలంగాణ ప్రభుత్వ రెసిడెంట్ కమిషనర్ అజయ్ మిశ్రా, ఇండస్ట్రీస్ కమిషనర్ జయేష్ రంజన్, ఇన్ఫర్మేషన్ అధికారి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు