కింకర్తవ్యం..?

18 Jun, 2014 23:57 IST|Sakshi
కింకర్తవ్యం..?

లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఉత్సాహం బీజేపీలో ఇప్పుడు కనిపించడం లేదు. ఇందుకు కారణం విద్యుత్, నీటి సమస్యలే. ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు యత్నిస్తుండగా, బీజేపీకి ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. నిన్నమొన్నటిదాకా శాసనసభ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అందుకు ఎంతమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు.
 
 సాక్షి, న్యూఢిల్లీ:విద్యుత్, నీటి సమస్యలపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం రాజకీయ వాతావరణాన్ని మార్చివేసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీవాసులు భారతీయ జనతా పార్టీకి అత్యంత అనుకూలంగా ఉండగా, ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఈ విషయాన్ని బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లు గమనించిన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో శాసనసభ  ఎన్నికలు తమకు అనుకూలం కాదేమోననే అనుమానం వాటికి తలెత్తింది. దీంతో ఇన్నాళ్లుగా ఎన్నికలొక్కటే మార్గమన్న  బీజేపీ ఇప్పుడు వ్యూహాన్ని మార్చింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ అనుకుంటోంది.
 
 ఢిల్లీలో అన్నిరకాల అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఢిల్లీ బీజే పీ ఇంచార్జి ప్రభాత్ ఝా ప్రకటించడం ఈ  విషయాన్ని ధ్రువీకరించింది. ఇతర పార్టీలను చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని నితిన్ గడ్కరీ తెలిపినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ పండితులు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలించడంతో రాజధానిలో శాసనసభ ఎన్నికలు జరిపించి పూర్తి మెజారిటీతో సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని  బీజేపీ భావించింది. ఇలా అనుకుంటున్న తరుణంలోనే ఎండలు ముదిరాయి.  విద్యుత్ కోతలు, నీటి సరఫరా సమస్యలు  తీవ్రమయ్యాయి. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుండడంతో ఈ సమస్యలపై బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్  ప్రయత్నిస్తున్నాయి.
 
 ఈ సమస్యలపై  కాంగ్రెస్ పార్టీ రోజుకో ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. తద్వారా నగరవాసుల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. వేసవిలో గంటల తరబడి విద్యుత్ కోతలు, నీటి  సరఫరా సమస్యల కారణంగా     బీజేపీకి ఢిల్లీలో ఆదరణ తగ్గిందని ఆర్‌ఎస్‌ఎస్‌కు సమాచారం అందింది. రాజధానిలో  విద్యుత్, నీటి సమస్యలు మరికొంత కాలం కొనసాగవచ్చని, ఈలోగా  రుతుపవనాలు  ప్రవేశిస్తాయని, వానలు పడితే నగర రోడ్లు నీటిమయమై కొత్త సమస్యలను సృష్టిస్తాయని, ఈ  పరిస్థితుల్లోఎన్నికలు జరిపించినట్లయితే తమకు పూర్తి  మెజారిటీ రాకపోవచ్చని, మరోసారి త్రిశంకు సభ ఏర్పాటు కావొచ్చని బీజేపీ అభిప్రాయపడుతోంది.
 
 అంతేకాకుండా తమకు మెజారిటీ లేనందువల్ల ఇతర పార్టీలను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని ఆ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి హర్షవర్ధన్ డిసెంబర్ నుంచి పలుసా ర్లు ప్రకటించిన ప్పటికీ  బీజేపీ శాసనసభ్యుల్లో అనేకమంది మరోమారు ఎన్నికలకు సిద్ధంగా లేరు. ఎన్నికలు జరిపించాలన్న పార్టీ వైఖరిని వారు మొదటి నుంచీ లోలోపల వ్యతిరేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ఎమ్మెల్యేలు జగ్‌దీశ్ ముఖి, రామ్‌వీర్ బిధూడీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కూడగట్టేందుకు, పార్టీ వైఖరిని మా ర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నా లు ఫలించాయని, ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సుముఖత వ్యక్తమవుతోందని వారంటున్నారు. దీంతో ఇంతకాలంగా ప్రభుత్వం ఏర్పాటుకు తెరవెనుక సాగిన ప్రయత్నాలు త్వరలోనే బహిరంగంగా సాగే అవకాశముంది. ఇందుకు సూచన రాజీవ్ ప్రతాప్ రూఢీ, ప్రభాత్ ఝా ప్రకటనలోనే కనిపించింది.
 

మరిన్ని వార్తలు