Delhi Liquor Policy Case: ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ డుమ్మా, నెక్ట్స్‌ ఏం ఏంటంటే..

2 Nov, 2023 11:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) విచారణకు ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆఖర్లో ఆయన ట్విస్ట్‌ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం ఉండడంతో విచారణకు రాలేనని, పైగా నోటీసులు చట్టవిరుద్ధమని, తనకు పంపిన సమన్లు వెనక్కి తీసుకోవాలని ఈడీకి లేఖ రాశారు. దీంతో ఆయనకు మరోసారి సమన్లు పంపే యోచనలో ఉన్నారు ఈడీ అధికారులు.  

కేసు దర్యాప్తులో భాగంగా నవంబరు 2న తమ ఎదుట హాజరు కావాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. లిక్కర్‌ స్కాంకు సంబంధించిన ఈ ఏడాది ఏప్రిల్‌లోనే కేజ్రీవాల్‌ను ఈడీ ప్రశ్నించింది. కానీ, తొలిసారిగా ఇప్పుడు సమన్లు జారీ చేసి విచారించాలనుకుంటోంది. కానీ, ఈడీ విచారణకు హాజరు కాకుండా మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌ పాల్గొనబోతున్నట్లు సమాచారం. 

తనకు పంపిన సమన్లు చట్టవిరుద్ధమని, అవి రాజకీయ ప్రేరేపితమైనవని.. తాను ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకోవడానికే నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. వెంటనే నోటీసుల్ని వెనక్కి తీసుకోవాలని ఈడీని కోరారాయన. 

ఈడీ సమన్ల ప్రకారం.. ఉదయం 11గం. ఆయన ఈడీ కార్యాలయానికి రావాల్సి ఉంది. కానీ, అదే సమయానికి ఆయన మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆప్‌ నేత, పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్‌తో సింగ్రోలి ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్నారు. 

ఒక వ్యక్తి ఈడీ సమన్లను మూడుసార్లు విస్మరించొచ్చు. ఆ తర్వాత కూడా తిరస్కరిస్తే.. నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ కింద ఈడీ ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేస్తుంది. మనీలాండరింగ్‌ యాక్ట్‌ ప్రకారం కూడా ఈడీ ఒకరికి నోటీసులు జారీ చేయొచ్చు. 

కేజ్రీవాల్‌ పేరు ఎందుకంటే..
కేజ్రీవాల్‌కు నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) నిబంధనల కింద ఈ సమన్లు ఇచ్చినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ 2021-22ని(ప్రస్తుతం రద్దైంది) రూపొందించే క్రమంలో, అమలు సమయంలో ముఖ్యమంత్రిగా, ఆప్‌ అధినేతగా కేజ్రీవాల్‌ను నిందితులు సంప్రదించారని ఛార్జిషీటులో ఈడీ పేర్కొంది. మద్యం డీలర్లకు భారీ ప్రయోజనం కలిగించేలా ఈ విధానాన్ని రూపొందించారని, ప్రతిగా వారి నుంచి కమీషన్లు పొందారని దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేజ్రీవాల్‌ను దర్యాప్తు సంస్థ ప్రశ్నించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది.

ఇదే కేసులో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోడియాకు రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ కావడం గమనార్హం.

అరెస్ట్‌ చేయాలనుకుంటోంది.. 
మరోవైపు.. ఆప్‌ను నిర్మూలించేందుకే కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆప్‌ నేతలు ధ్వజమెత్తారు. దీనిలో భాగంగానే కేజ్రీవాల్‌పై బూటకపు కేసులు పెట్టి జైలుకు పంపించేందుకు ఈడీ సమన్లు జారీ చేసిందని విమర్శలు గుప్పిస్తోంది. ఇక నేటి విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ అరెస్ట్‌ కావడం ఖాయం అంటూ ప్రచారం చేస్తోంది. కేవలం కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందునే ఆయన్ని కటకటాల వెనక్కి పంపే ప్రయత్నం జరుగుతోందని ఆప్‌ ఆరోపణలు గుప్పిస్తోంది. 

మరిన్ని వార్తలు