భవనాలు కరువు.. పరిపాలన బరువు

15 Oct, 2016 12:38 IST|Sakshi

సొంత భవనాలు లేక ఇక్కట్లు
నిర్వహణకు ఇబ్బందులు
 
 బెల్లంపల్లి:   బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పడటంతో కొత్త కార్యాలయాల ఏర్పాటు కోసం అన్వేషణ సాగుతోంది. ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ప్రారంభించడానికి తగిన భవనాలను వెతుకుతున్నారు. ఇప్పటి వరకు ఆర్డీఓ కార్యాలయం మాత్రమే ప్రారంభం కాగా, ఇతర శాఖల కార్యాలయాలు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. వీటిని సైతం సత్వరంగా ప్రారంభించడానికి ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తోంది.
 
 దసరా పర్వదినం నుంచి..
 జిల్లాల పునర్విభజనలో భాగంగా బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా అవతరించింది. బెల్లంపల్లిలో దసరా పర్వదినం రోజున రెవె న్యూ డివిజన్ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆ రోజు నుంచే రెవెన్యూ డివిజన్ కార్యాలయం నుంచి పరిపాలన ఆరంభమైంది. రెవెన్యూ డివిజనల్ కార్యాలయంతో పాటు సబ్ ట్రెజరరీ, ఎంవీఐ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరా జ్ ఇతర శాఖల కార్యాలయాలు  ఏర్పాటు కా వాల్సి ఉంది.

ఇప్పటికే బెల్లంపల్లిలో సబ్ డివి జనల్ పోలీసు కార్యాలయం, వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయాలు ఉన్నాయి. దశల వారీగా మిగిలిన ప్రభుత్వ శాఖలకు చెందిన సబ్ డివి జనల్ కార్యాలయాలను ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అధికారులు, సిబ్బంది, భవనాల కొరత కారణంగా  నూతన కార్యాలయాల ఏర్పాటులో జాప్యమవుతున్న ట్లు తెలుస్తోంది.
 
ఏడు మండలాలు, 64 పంచాయతీలు..
తాండూర్, కాసిపేట, బెల్లంపల్లి, నెన్నెల, భీమి ని, వేమనపల్లి, కన్నెపల్లి మండలాలతో కొత్తగా రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో  64 గ్రామపంచాయతీ లు, 155 రెవెన్యూ గ్రామాలను ఏర్పర్చారు. 20 11 జనాభా లెక్కల ప్రకారం 2,15,614 మంది జనాభా రెవెన్యూ డివిజన్‌లో ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో 1,08, 879 మంది పురుషులు ఉండగా, 1,06,735 మంది స్త్రీలు ఉన్నారు. 

56,206 మంది ఎస్సీ జనాభా ఉండగా, 21,999 మంది ఎస్టీ జనాభా ఉన్నారు. డివిజన్ వ్యాప్తంగా బెల్లంపల్లి, కాసిపేట మండలాల పరిధిలో 9 ఏజెన్సీ గ్రామాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఏజెన్సీ గ్రామాలలో 25, 064 మంది గిరిజనులు నివసిస్తుండగా పురుషులు 12,525 మంది, మహిళలు 12,539 మం ది ఉన్నారు. బెల్లంపల్లి మండలంలో చాకెపల్లి ఏకైక ఏజెన్సీ గ్రామం కాగా, కాసిపేట మండలంలో దేవాపూర్, ధర్మరావుపేట, కాసిపేట, ముత్యంపల్లి, రొట్టపల్లి, వెంకటాపూర్, గట్రావ్‌పల్లి, చింతగూడ గిరిజన గ్రామాలు ఉన్నాయి.  
 
కలగనున్న సౌలభ్యం..
బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పడటంతో ఏడు మండలాల ప్రజలకు పరిపాలన సౌలభ్యం ఎంతగానో కలగనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బెల్లంపల్లితో విడదీయని బంధం ఉంది. భీమిని, నెన్నెల, కన్నెపల్లి, వేమనపల్లి, తాండూర్, కాసిపేట మండలాల నుంచి రోజువారీగా ప్రతి పనికి గ్రామీణులు బెల్లంపల్లికి వస్తుంటారు. ప్రస్తుతం బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌గా రూపాంతరం చెందడంతో పరిపాలన మరింత చేరువైంది.

మరిన్ని వార్తలు