ఆ మూడ్రోజులు ‘ఢిల్లీ’కి సెలవు..

27 Aug, 2023 06:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ జి–20 శిఖరాగ్ర సదస్సుకు సమాయత్తమవుతోంది. సెపె్టంబర్‌ 8, 9, 10వ తేదీల్లో జరిగే ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. సదస్సు దృష్ట్యా వచ్చే నెల 8 నుంచి మూడ్రోజుల పాటు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సదస్సుకు హాజరవుతున్న భాగస్వామ్య దేశాల నేతల భద్రత దృష్ట్యా ఆ మూడు రోజులూ లుటియన్స్‌ ఢిల్లీలోని అన్ని మాల్స్, మార్కెట్లను మూసి ఉంచాలన్న పోలీసు శాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ సక్సేనా ఆమోదం తెలిపారు.

అంతేకాకుండా, రాజధానిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, దుకాణాలు, వాణిజ్య వ్యాపార సంస్థలను మూసివేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సుప్రీంకోర్టు, సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సహా కొన్ని మెట్రో స్టేషన్లు మూసివేయనున్నారు. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రభుత్వ బస్సుల రాకపోకలను గణనీయంగా తగ్గించనున్నారు. సదస్సుకు 20 దేశాల అధినేతలు సహా 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యే అవకాశం ఉంది. హాజరయ్యే ముఖ్యుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్, యూకే ప్రధాని రిషి సునాక్, జపాన్‌ ప్రధాని ఫ్యూమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ల తదితరులున్నారు.  

హోటళ్లకు పెరిగిన గిరాకీ...
జీ20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీ సహా, గురుగ్రావ్, నోయిడాల్లోని పెద్ద హోటళ్లకు గిరాకీ పెరిగింది. ప్రపంచ నాయకులతో పాటు వారి ప్రతినిధి బృందాలు, భారీ రక్షణ, మీడియా బృందాలు ముందుగానే భారత్‌ చేరుకుంటుండటంతో టాప్‌ ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో బుకింగ్‌లు పెరిగాయి. సెపె్టంబర్‌ 6 నుంచి 12 మధ్య అన్ని ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు పూర్తిగా బుక్‌ అయ్యాయని తెలుస్తోంది. హోటల్‌ గదుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలోని ఏరోసిటీలోని హోటల్‌లో ఉత్తమమైన సూట్‌ ఒక రాత్రికి రూ.20 లక్షల చొప్పున కోట్‌ చేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్‌కు కూతవేటు దూరంలోని జన్‌పథ్‌ సమీపంలోని ఒక హోటల్‌లో ప్రధాన సూట్‌కు ఒక్క రాత్రికి రూ.15 లక్షలకు బుక్‌ అయిందని అవి వెల్లడించాయి.

మరిన్ని వార్తలు