అడ్మిషన్లకు కొత్త షెడ్యూలు

26 Feb, 2014 23:46 IST|Sakshi
న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి అంతర్రాష్ట్ర బదిలీ కేసుల్లో ఐదు పాయింట్ల విధానాన్ని రద్దు చేసి గురువారం కొత్త షెడ్యూలును ప్రకటిస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) హైకోర్టుకు బుధవారం తెలిపారు. ఎల్జీ తాజా ప్రకటనతో ప్రస్తుతం అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో కొనసాగుతున్న నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియ స్తంభించే అవకాశాలున్నాయి. అంతర్రాష్ట్ర బదిలీలకు ఐదు పాయింట్ల విధానాన్ని రద్దు చేయడంతోపాటు పాయింట్ల కేటాయింపు విధానాన్ని సమీక్షిస్తామని ప్రభుత్వం న్యాయమూర్తి మన్మోహన్‌కు తెలిపింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం మొత్తం 100 పాయింట్లలో స్థానిక విద్యార్థులకు (నైబర్‌హుడ్) 70 కేటాయిస్తారు. ఇది వరకే స్కూల్లో చదువుతున్న విద్యార్థి తోబుట్టువులు దరఖాస్తు చేసుకుంటే వారికి 20 పాయింట్లు ఇస్తారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు సదరు పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే దరఖాస్తుదారుడికి ఐదు పాయింట్లు ఇస్తారు.
 
 ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి (అంతర్రాష్ట్ర బదిలీలు) వచ్చి అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఐదు పాయింట్లు కేటాయిస్తారు. 75 నుంచి 100 మధ్య పాయింట్లు వచ్చిన వారి పేర్లు మాత్రమే అడ్మిషన్ల కోసం తీసే డ్రాలో ఉంచుతారు. 90 పాయింట్లు వచ్చిన వారికి కచ్చితంగా అడ్మిషన్ ఇస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి బదిలీ అయిన తల్లిదండ్రుల పిల్లలకు ఐదు పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సుధాంశు జైన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎల్జీ పైవిధంగా వివరణ ఇచ్చారు. ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్ నేతృత్వంలోని బెంచ్‌కు కూడా ఇదే తరహా కేసు వచ్చింది. అంతర్రాష్ట బదిలీలకు పాయింట్లు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇదిలా ఉంటే వికలాంగుల కోటాల్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ఎంతో చెప్పాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తం సీట్లలో మూడుశాతం సీట్లను వారికి కేటాయించా ల్సిందేనని హైకోర్టు ద్విసభ్య బెంచ్ స్పష్టం చేసింది. 
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు