కిడ్నాప్ కేసు దర్యాప్తు ముమ్మరం

9 Oct, 2014 23:06 IST|Sakshi

 నోయిడా: చిన్నారి అభినవ్ కిడ్నాప్ కేసు దర్యాప్తును ఉత్తరప్రదేశ్ పోలీసులు ముమ్మరం చేశారు. నోయిడాలోని బిషణ్‌పురాలోగల ఇంటి నుంచి సెప్టెంబర్ 26న బాలుడు కనిపించకుండా పోయాడు. ఫిర్యాదు అందిన వెంటనే మీరట్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ వివిధ జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. ఘజియాబాద్, హపూర్, బులందేశ్వర్ జిల్లా పోలీసులకు బాలుడి విషయమై సమాచారం ఇచ్చారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో సోషల్ మీడియాను భాగస్వామ్యం చేయాలని పోలీసులకు ఐజీ అలోక్ శర్మ సూచించారు.  చిన్నారి ఆచూకీ కోసం ఐదు జిల్లాలోని 35,000 సిబ్బంది రంగంలోకి దిగినట్లు చెప్పారు. ‘ అభినవ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఐదు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాల పోలీసుల సహకారాన్ని కూడా తీసుకొంటున్నామని చెప్పారు.  అనుమానాస్పదస్థితిలో 18  ఏళ్ల బాలుడు సెప్టెంబర్ 26న కనిపించకుండా పోయాడని అతడి  తండ్రి అలోక్‌సింగ్ 29వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇతడు ఐటీ  కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేస్తున్నారు.
 
 గాలింపులో పది పోలీసుల బృందాలు
 ఢిల్లీ-ఎన్‌సీఆర్, సమీప రాష్ట్రాలు రాజస్థాన్, హర్యానాలో పది పోలీసు బృందాలు గాలింపు చేపడుతున్నట్లు గౌతమ్ బుద్దనగర్‌కు చెందిన సీనియర్ ఎస్పీ ప్రీతీందర్ సింగ్ చెప్పారు. రాష్ట్ర పోలీసులు జీబీనగర్, ఇతర జిల్లాలు, సామాజిక మీడియాకు అభినవ్ వివరాలను  అందజేశారని చెప్పారు. నలుగురు పోలీసులు ఒక బృందంగా గాలిస్తున్నారని చెప్పారు. ‘ ఉదయం అభినవ్ జోధ్‌పూర్ ఉన్నట్లు గుర్తించి అక్కడికి వె ళ్లినా ఫలితం లేకుండా పోయింది. మరో బృందం గుర్గావ్ వెళ్లి ఉట్టిచేతులతో తిరిగివచ్చిందని చెప్పారు. ఇప్పటి వరకూ బాధిత కుటుంబానికి కిడ్నాపర్ల నుంచి ఎటువంటి బెదిరింపు ఫోన్‌కాల్ రాలేదు. పిల్లలు లేని దంపతులు బాలుడిని అపహరించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే కేసు ఛేదిస్తామని అన్నారు.
 

మరిన్ని వార్తలు