ఆన్‌లైన్‌లో ఖైదీల వివరాలు

19 Jan, 2015 22:37 IST|Sakshi

సాక్షి, ముంబై: రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల వివరాలు, ఇతర సమాచారం ఇక నుంచి ఒక క్లిక్‌తో లభించనుంది.  ఖైదీల వివరాలకు సంబంధించిన ‘డేటా బ్యాంక్’ను రూపొందించేందుకు జైళ్ల శాఖ ‘ఇ-ప్రిజన్’ అనే పథకాన్ని చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది సెంట్రల్, 27 జిల్లా, 10 ఓపెన్, 172 సబ్ జైళ్లు ఉన్నాయి. ముంబై, పుణేలో మహిళల కోసం ప్రత్యేక కారాగాలున్నాయి.

జైళ్లలో ప్రస్తుతం శిక్ష అనుభివస్తున్న ఖైదీల వివరాలు, ఇతర సమాచారం కాగితాలపై నమోదు చేస్తున్నారు. దీంతో ఖైదీలు తప్పుడు చిరునామ ఇస్తూ, పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఖైదీల సమాచారం ఆన్‌లైన్‌లో పోగుచేసి అందుకు అవసరమైన డేటా బ్యాంక్ తయారు చేయనున్నట్లు జైళ్ల శాఖ ప్రత్యేక ఐజీ బిపిన్‌కుమార్ సింగ్ చెప్పారు.

ఖైదీ నివాసముండే ప్రాంతం, ఏ నేరం కింద, ఏ జైలులో, ఎన్ని రోజులు ఉన్నాడు? లేదా ఉంటాడు?  తదితర వివరాలు క్లిక్ చేస్తే చాలు లభిస్తాయని ఆయన చెప్పారు. ఈ వివరాలు సామాన్య ప్రజలకే కాకుండా పోలీసు శాఖకు కూడా ఉపయోగపడతాయని ఆయన అన్నారు. అనేక సందర్భాలలో ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు లభిస్తున్నాయి.

కొందరు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం కారణంగా అవి జైలులోకి వస్తున్నాయి. దీంతో ఖైదీలు జైలులో ఉండి తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. వ్యాపారులను బెదిరించడం, బలవంతపు వసూళ్లకు పాల్పడడం లాంటి పనులు చేస్తున్నారు. దీంతో జైలు పరిసరాల్లో మొబైల్ జామర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు