మాతోనే భవిష్యత్తు

14 May, 2017 02:59 IST|Sakshi
మాతోనే భవిష్యత్తు

ఎడపాడికి పన్నీర్‌ వార్నింగ్‌
 ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్న ఎంపీ మైత్రేయన్‌


సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలోని చీలికవర్గాల మధ్య రాజకీయం రసకందాయంలో పడింది. తమతో కలవకుంటే రాజకీయ ప్రమాదం తప్పదని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సీఎం ఎడపాడికి శనివారం అల్టిమేటం ఇచ్చారు. అలాగే పన్నీర్‌వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు మైత్రేయన్‌ సైతం ఎడపాడి ప్రభుత్వ పతనానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభ మైందని వ్యాఖ్యానించారు. ఇరువురు నేతలు వేర్వేరు కార్యక్రమాల్లో ఎడపాడి ప్రభుత్వానికి  ఒకేరకమైన హెచ్చరికలు జారీచేయడం గమనార్హం.

జయలలిత మరణం తరువాత రెండుగా చీలిపోయిన అన్నాడీఎంకే నేతలు ఇటీవల మళ్లీ ఏకమయ్యే ప్రయత్నాలు చేశారు. విడిపోవడం వల్ల రెండాకుల చిహ్నం చేజారిపోతుందని కారణంతో రాజీబాట పట్టారు. అయితే అన్నాడీఎంకే (అమ్మ) ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ల శాశ్వత బహిష్కరణ, అమ్మ మరణంపై సీబీఐ విచారణ డిమాండ్లకు అంగీకరిస్తేనే విలీనానికి  సిద్దం అవుతామని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గం షరతు విధించింది.

 ఈ షరతులకు ఎడపాడి వర్గం తలొగ్గక పోవడంతో విలీనానికి బ్రేకు పడింది. రాజీ చర్చల అంశం దాదాపుగా తెరమరుగై పోయింది. ఈ దశలో శనివారం సేలంలో జరిగిన అన్నాడీఎంకే (పురట్చితలైవి అమ్మ) సభలో పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ, ఎంజీఆర్‌ స్థాపించిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నంను కాపాడుకునేందుకు తాము ముందుకు వచ్చినా దినకరన్‌ను బహిష్కరించినట్లు ఎడపాడి వర్గం కపటనాటకం అడిందని విమర్శించారు. అలాగే మంత్రులు సైతం లేనిపోని విమర్శలతో మోకాలడ్డారని అన్నారు. శశికళ కుటుంబం చేతిలో పార్టీ, ప్రభుత్వం ఉండడంపై తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.

ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు కట్టుబడి ఉన్న తమతో చేరకుంటే రాజకీయ భవిష్యత్తు లేదని ఎడపాడి వర్గం గుర్తించాలని పన్నీర్‌సెల్వం హెచ్చరించారు. మంత్రుల అవినీతి, అసమర్ద పాలన, ప్రజావ్యతిరేకతతో ప్రభుత్వం కూలిపోతే తాము బాధ్యులం కాదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఉంగళుక్కాగ ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ సునీల్‌ అధ్వర్యంలో చెన్నై పనగల్‌పార్కు వద్ద శనివారం ఏర్పాటు చేసిన సేవా శిబిరాన్ని ప్రారంభించిన మైత్రేయన్‌ మీడియాతో మాట్లాడుతూ, అవినీతి మంత్రులతో కూడిన ఎడపాడి ప్రభుత్వాన్ని ఎవ్వరూ కూల్చాల్సిన అవసరం లేదు, తనకు తానే కూలిపోతుందని వ్యాఖ్యానించారు.

 రెండాకుల చిహ్నంపై ఈసీ వద్ద ఇరువర్గాల వాదనలను పూర్తయ్యాయి, త్వరలో ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని, రెండాకుల చిహ్నం తమకే దక్కుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఎడపాడి వైపు 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయంలో తమకు ఎలాంటి చింతలేదు, మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలే ప్రభుత్వాన్ని కూల్చివేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎడపాడి ప్రభుత్వ పతనానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి, తాము జయించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు