AIADMK New Alliance For 2024: సీఎం స్టాలిన్‌, ఉదయనిధిపై ఫైర్‌.. అన్నాడీఎంకే కీలక ప్రకటన

28 Sep, 2023 15:24 IST|Sakshi

తమిళనాడు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్‌

సీఎం స్టాలిన్‌, ఉదయనిధికి అన్నాడీఎంకే కౌంటర్‌

అన్నామలై తొలగింపు ప్రకటనపై క్లారిటీ

స్పీడ్‌ పెంచిన పళణిస్వామి

చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలే ఎన్డీయేకు గుడ్‌ బై చెప్పిన అన్నాడీఎంకే తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామని అన్నాడీఎంకే వెల్లడించింది. ఈ ‍క్రమంలో తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే, బీజేపీ పార్టీపై అన్నాడీఎంకే నేతలు ఘాటు విమర్శలు చేశారు. 

2024 ఎన్నికల నాటికి కొత్త కూటమి..
అయితే, తమిళనాడులోకి క్రిష్ణగిరిలో అన్నాడీఎంకే నేత మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ చెబుతున్నట్టు తాము బీజేపీతో తాము కూటమిలో లేమని స్పష్టం చేశారు. మేం బీజేపీతో పొత్తు తెంచుకుంటే ఎలా ఉంటుందో వారికి తెలుసు. అందుకే భయంతో వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీతో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకున్నట్టు తెలిపారు. పళానిస్వామి సారథ్యంలో కొత్త కూటమిని ఏర్పాటు చేసి నాయకత్వం వహిస్తామన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు.

అన్నామలైపై కీలక ప్రకటన..
ఇదే సమయంలో తాము  తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలైని పదవి నుంచి తొలగించాలని కోరలేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే వంటి పెద్ద పార్టీ ఒక పార్టీని వారి రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని కోరుతుందని అనుకోవడం చిన్నపిల్లల మనస్తత్వం. మేం అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయం. వేరే పార్టీ ఎలా పని చేయాలో చెప్పే అనాగరిక నేతలం మేం కాము. అన్నాడీఎంకే అలాంటి పార్టీ కాదని వివరణ ఇచ్చారు. 

మరోవైపు.. అన్నాడీఎంకే సీనియర్‌ నేత జయకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇకపై కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. కొత్త కూటమి విషయంగా ఎన్నికల సమయంలో నిర్ణయం ఉంటుందని, తమ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి అన్ని విషయాలను త్వరలో ప్రకటిస్తారన్నారు.

స్పీడ్‌ పెంచిన పళణిస్వామి..
ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన అనంతరం పళణి స్వామి పార్టీలో మార్పులు చేర్పులకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న ఆరు జిల్లాలకు కొత్త కార్యదర్శులను బుధవారం నియమించారు. మరికొన్ని జిల్లాల కార్యదర్శులలో స్వల్ప మార్పులు చేశా రు. అనుబంధ విభాగాలకు కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు కన్యాకుమారి జిల్లా కార్యదర్శిగా మాజీ మంత్రి దళవాయి సుందరం, తిరుచ్చి మహానగర కార్యదర్శిగా మాజీ డిప్యూటీ మేయర్‌ శ్రీనివాసన్‌, పెరంబలూరు జిల్లా కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే తమిళ్‌ సెల్వం, తంజావూరు తూర్పు కుంబకోణం కార్యదర్శి రామనాథన్‌, తంజావూరు సెంట్రల్‌ జిల్లా కార్యదర్శిగా శరవణన్‌, తేని జిల్లా (తూర్పు) కార్యదర్శిగా రామర్‌, (పశ్చిమం) జక్కయ్యన్‌ను నియమించారు. అలాగే, రాణి పేట, తిరువణ్ణామలై, తిరునల్వేలి, తదితర మరికొన్ని జిల్లాలలో కార్యదర్శులు మార్పు జరిగింది. అయితే, ఒక జిల్లా నుంచి మరోజిల్లాకు కార్యదర్శుల పోస్టులను బదిలీ చేసే రీతిలో నియామకాలు జరిగాయి.

అన్నామలైకి ఢిల్లీ నుంచి పిలుపు..
ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే తమను పక్కన పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు ఢిల్లీ నుంచి పిలుపురావడం గమనార్హం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో అన్నామలై భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయో వేచి చూడాల్సిందే. అదే సమయంలో ఈ భేటీ తర్వాత తమను టార్గెట్‌ చేసి ఐటీ, ఈడీ దాడులకు బీజేపీ సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నట్లు కొందరు అన్నాడీఎంకే సీనియర్లు పేర్కొంటుండడం గమనార్హం.

ఇది కూడా చదవండి: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. రంగంలోకి సీనియర్‌ ఐపీఎస్‌.. ఎవరీ రాకేష్‌ బల్వాల్‌!

మరిన్ని వార్తలు