తమిళనాట బీజేపీ పాలి‘ట్రిక్స్‌’.. మరో కొత్త ఎత్తుగడ?

29 Sep, 2023 20:41 IST|Sakshi

చెన్నై: తమిళనాడులో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే బ‌హిష్కృత నేత, త‌మిళ‌నాడు మాజీ సీఎం ప‌న్నీర్‌సెల్వం ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం త‌న‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోందని వ్యాఖ్యలు చేశారు. దీంతో, తమిళనాడు రాజకీయం హాట్‌ టాపిక్‌గా మారింది. 

బీజేపీ కొత్త ప్లాన్‌..
అయితే, తమిళనాడులో అన్నాడీఎంకే.. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కూటమిని ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ ప్ర‌తినిధి మునుస్వామి స్ప‌ష్టం చేశారు. 2024 ఎన్నికల నాటికి కొత్త కూటమితోనే బరిలోకి దిగుతామన్నారు. మరోవైపు.. అన్నాడీఎంకే బ‌హిష్కృత నేత పన్నీరు సెల్వం బాంబు పేల్చారు. పళనిస్వామి.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న వెంటనే ఆ పార్టీ తనను సంప్రదించినట్టు తెలిపారు. బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం త‌న‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ద‌ని, కూట‌మిపై బీజేపీ ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత‌నే త‌న వైఖ‌రి వెల్ల‌డిస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

పళణిస్వామిపై సెటైర్లు..
ఇదే సమయంలో అన్నాడీఎంకేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామ‌లైని మార్చాల‌ని అన్నాడీఎంకే.. కమలం పార్టీపై ఒత్తిడి తీసుకువ‌చ్చింద‌నే ప్ర‌చారంపై ఆయన స్పందించారు. అన్నాడీఎంకేకు ప‌ళ‌నిస్వామిని మార్చాల‌ని బీజేపీ కోరితే ఆ పార్టీ అంగీక‌రిస్తుందా అని ఎదరు ప్ర‌శ్నించారు. బీజేపీ ఒత్తిడికి త‌లొగ్గి ప‌ళ‌నిస్వామిని మార్చేస్తుందా అని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వాన్ని మార్చాల‌ని ఎలా అడుగుతార‌ని విమర్శలు చేశారు. అలా అడిగే హ‌క్కు ప‌ళ‌నిస్వామి పార్టీకి లేద‌ని సీరియస్‌ అయ్యారు. అయితే, పన్నీరు సెల్వం.. బీజేపీతో కలిస్తే ఇప్పటి వరకు అన్నాడీఎంకేతో ఉన్న కేడర్‌ కమలం పార్టీ సపోర్టు చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో, పళనిస్వామి వర్గానికి ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్‌ ఉందంటున్నారు. 

ఇది కూడా చదవండి: ఇస్కాన్‌పై సంచలన ఆరోపణలు.. మేనకా గాంధీకి బిగ్‌ షాక్‌

మరిన్ని వార్తలు