రాజకీయం అంతా రహస్యంగా...

10 Jun, 2017 08:00 IST|Sakshi
అంతా రహస్యం!

పన్నీరుతో పళని విలీన వ్యూహం 
ఢిల్లీకి దినకరన్‌
కమలనాథులతో ఆశీస్సుల కోసం ప్రయత్నం
శశికళతో దివాకరన్‌ ములాఖత్‌
అన్నాడీఎంకేపై పెరిగిన కేంద్రం ఒత్తిడి
ప్రతిపక్షాల ఆరోపణ 
మా జోక్యం లేదన్న వెంకయ్య

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో రాజకీయం అంతా రహస్యంగా మారుతోంది. రహస్య చర్చలు, మంతనాల్లో గ్రూపులు నిమగ్నమయ్యాయి. కమలం పెద్దల దర్శనంతో వారి ఆశీస్సుల కోసం దినకరన్‌ ఢిల్లీ బాట పట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, దినకరన్‌ ఆదిపత్యానికి చెక్‌ పెట్టడం లక్ష్యంగా పన్నీరుతో రహస్యంగా విలీన చర్చలో పళని తలమునకలై ఉన్నట్టు సమాచారం. ఈ పరిణా మాల నేపథ్యంలో అన్నాడీఎంకే సర్కారుకు మెజారిటీ ఉందా అన్న ప్రశ్నను తెర మీదకు తెస్తూ గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడానికి ప్రధాన ప్రతి పక్షం సిద్ధమవుతోంది.

అన్నాడీఎంకేలోసాగుతున్న రాజకీయ పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌కు మద్దతుగా 32 మంది ఎమ్మెల్యేలు కదలడం, ఆ కుటుంబానికి చెందిన దివాకరన్‌తో మరి కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు భేటీకావడం సీఎం పళనిస్వామి ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితిలో దినకరన్‌ లేదన్న సంకేతాలు కాస్త ఊరట నిచ్చినా, ఎక్కడ కుర్చీకి ఎసరు పెడుతాడోనన్న బెంగ పళనికి తప్పడం లేదు. దినకరన్‌ ఆధిపత్యానికి చెక్‌ పెట్టడం లక్ష్యంగా పళనిస్వామి స్వయంగా రంగంలోకి దిగినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.

మాజీ సీఎం పన్నీరు శిబిరంతో విలీనం లక్ష్యంగా పావులు కదిపేందుకు వ్యూహ రచన చేశారు. కమిటీలు, మంత్రుల బృందాల ద్వారా చర్చల వ్యవహారాలు బహిర్గతం అవుతుండడంతో రహస్య మంతనాలకు సిద్ధమైనట్టు తెలిసింది. మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవీ శిబిరంతో విలీనం సాగిన పక్షంలో కేంద్రం అండదండాలు మరింతగా తన ప్రభుత్వానికి దక్కడం ఖాయం అన్న నిర్ణయానికి సీఎం వచ్చారు. కేంద్రం సహకారంతో దినకరన్‌కు చెక్‌ పెట్టడంతో పాటు ఎమ్మెల్యేలను గాడిలో పెట్టుకోవచ్చన్న నిర్ణయంతో విలీన ప్రయత్నాల వేగవంతానికి పరుగులు తీస్తున్నట్టుగా అన్నాడీఎంకే అమ్మ శిబిరం వర్గాల్లో చర్చ సాగుతోంది.

రహస్యంగా పరుగులు..
విలీన చర్చలు రహస్యంగా సాగడం లక్ష్యంగా పళని నిర్ణయించారు. స్వయంగా పన్నీరు సెల్వంతో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. సీఎంగా తాను కొనసాగేందుకు కేంద్రం సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన దృష్ట్యా, ఇక, పన్నీరును విలీనం వైపునకు తిప్పుకోవడం లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పన్నీరుకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించడం ద్వారానే ‘విలీనం’ సాధ్యం అవుతుందన్న నిర్ణయాన్ని ఓ సీనియర్‌ మంత్రి సీఎంకు సూచించినట్టు తెలిసింది. దీంతో పన్నీరుకు ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించేందుకు కొత్త ఎత్తులకు సిద్ధం అవుతోన్నట్టు చర్చ.

తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, చిన్నమ్మ శశికళ జైల్లో ఉండడాన్ని పరిగణలోకి తీసుకుని ఆమెను ఆ పదవి నుంచి తప్పించి, పార్టీ సాధారణ సభ్యురాలుగా నియమించేందుకు తగ్గ వ్యూహంతో పళని ముందుకు సాగుతున్నట్టు సమాచారం. శశికళను సాధారణ సభ్యురాలుగా చేసిన పక్షంలో ఆమె నియమించిన ఉప ప్రధాన కార్యదర్శి పదవి రద్దు అయ్యేందుకు చాన్స్‌ ఉందన్న విషయాన్ని పరిగణించారు. విలీనం తదుపరి కేంద్రం అండదండాలతో దినకరన్‌ను ఒంటరి చేయడం, ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకుని నాలుగేళ్లు సజావుగా ముందుకు సాగే వ్యూహంతో పళని ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక, పళని వ్యూహాలు ఆచరణలో పెట్టే విధంగా పన్నీరు ముందుకు సాగేనా అన్నది వేచి చూడాల్సిందే.

కమలం పెద్దల ఆశీస్సుల కోసం: తనకు వ్యతిరేకంగా పళని సర్కారు వ్యూహ రచనల్లో ఉన్న సమాచారంతో ముందస్తు ప్రయత్నాల్లో దినకరన్‌ ఉన్నట్టుంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆయన ఢిల్లీలో తిష్ట వేసి కమలం పెద్దల దర్శనం, ఆశీస్సుల కోసం ప్రయత్నాల్లో ఉండడం గమనార్హం. గురువారం రాత్రి తన మద్దతుదారులకు కూడా సమాచారం ఇవ్వకుండా దినకరన్‌ ఢిల్లీకి చెక్కేయడం గమనార్హం. పళనిస్వామిని ఇరకాటంలో పెట్టే రీతిలో కమలం పెద్దలతో సంప్రదింపులు సాగించి, తనకు ఆశీస్సులుఅందించాలని కమలం పెద్దల్ని వేడుకునేపనిలో పడ్డట్టు చర్చ. ఇక, శశికళ సోదరుడు దివాకరన్‌ పరప్పన అగ్రహార చెరలో సోదరితో ములాఖత్‌ కావడం గమనార్హం. ఇక్కడి రాజకీయ పరిస్థితులను, దినకరన్‌కు మద్దతు కదిలిన ఎమ్మెల్యేలు, తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేల గురించి శశికళకు వివరించినట్టు తెలిసింది.

ఫిర్యాదుకు ప్రతి పక్షాలు :
అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజారిటీ ఉందా అన్న ప్రశ్నను ప్రతిపక్షాలు తెర మీదకు తెచ్చారు. కేంద్రం గుప్పెట్లో ఆ ప్రభుత్వం ఉన్న దృష్ట్యా, మనుగడ సాగిస్తున్నదని వీసీకే నేత తిరుమావళవన్‌ విమర్శించారు. ఇక, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్‌ అయితే, జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆ ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో తేల్చుకునేందుకు గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక, తమిళనాడు ప్రభుత్వంలో తమ జోక్యమే లేదని మరో మారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు