పన్నీరు, టీటీవీ, శశికళ మద్దతుదారులే టార్గెట్‌

23 Aug, 2023 09:47 IST|Sakshi

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే నుంచి ఉద్వాసనకు గురైన పన్నీరు సెల్వం, టీటీవీ దినకరన్‌ మద్దతు దారులను పార్టీలోకి ఆహ్వానించడమే లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ముగ్గురు మినహా తక్కిన నాయకులు అందరూ పార్టీలోకి రావాలని పిలుపు నివ్వడమే కాకుండా, ఆయా జిల్లాలోని పార్టీ నేతల ద్వారా మంతనాలు జరిపి పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టినానంతరం మదురై వేదికగా మహానాడును పళణి స్వామి విజయవంతం చేసుకుని మంచి జోష్‌ మీదున్నారు.

మాజీ సీఎం పన్నీరుసెల్వం, అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత దినకరన్‌, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న దక్షిణ తమిళనాడులో తన బలాన్ని నిరూపించుకునే విధంగా పళణి స్వామి సఫలీకృతులయ్యారు. మహానాడుకు 15 లక్షల మంది వచ్చినట్టుగా స్వయంగా పళణిస్వామి ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో దక్షిణ తమిళనాడులో తన బలాన్ని మరింత పెంచుకునేందుకు సిద్ధమయ్యా రు.

పార్టీ కిందిస్థాయి కేడర్‌ అంతా తన వెన్నంటి ఉండడంతో, ద్వితీయ శ్రేణి, జిల్లాస్థాయిలో కీలకంగా ఉన్న పన్నీరు, టీటీవీ, శశికళ మద్దతు నాయకులను తన వైపునకు తిప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ముగ్గురు నాయకులు మినహా తక్కిన వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తూ ప్రకటన చేశారు. తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న మదురై కోటలో పళణి స్వామి తన బలాన్ని నిరూపించుకు వెళ్లడంతో ఆయన వెన్నంటి నడిచేందుకు పన్నీరు, టీటీవీ, శశకళ మద్దతుదారులు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. వీరందరినీ పార్టీలోకి మళ్లీ తీసుకొచ్చే బాధ్యతలను ఆయా జిల్లాలోని నేతలకు పళణి స్వామి అప్పగించారు.

మరిన్ని వార్తలు