Sakshi News home page

తమిళనాట ట్విస్ట్‌.. ఎన్‌డీఏకు అన్నాడీఎంకే గుడ్‌బై..

Published Mon, Sep 25 2023 5:53 PM

AIADMK Announces Break Alliance With BJP In TamilNadu - Sakshi

సాక్షి, చెన్నై: దేశ, తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీఏ కూటమి నుంచి తాము వైదొలగుతున్నట్టు అన్నాడీఎంకే ఓ ప్రకటనలో​ స్పష్టం చేసింది. ఈ సందర్బంగా అన్నాడీఎంకే నేతలు తమిళనాడు బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

ఈ సందర్బంగా అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుస్వామి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నుంచి బీజేపీ, ఎన్డీయే కూటమితో అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకుంటోంది. నేడు జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు అన్నాడీఎంకే ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మా పార్టీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. గత ఏడాది కాలంగా మా పార్టీ జనరల్‌ సెక్రటరీ పళనిస్వామి, పార్టీ కేడర్‌పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదే సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు మునుస్వామి. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అన్నాడీఎంకే కొత్త కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఇక, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే.  ఈ ఎన్నికల్లో డీఎంకే భారీ మెజార్టీతో విజయం సాధించింది.  

 అయితే, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దివంగత ముఖ్యమంత్రి జయలలితను విమర్శించడంతో మొదలుపెట్టి ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతి జాబితాను విడుదల చేస్తానని అనడం, అలాగే, దివంగత సీఎం అన్నాదురై పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అన్నాడీఎంకే నేతలకు అస్సలు మింగుడుపడలేదు. దీంతో ఆ పార్టీలో సీనియర్లంతా అన్నామలై తీరుపై నిప్పులు చెరిగారు. ఇదే తరుణంలో మాజీ మంత్రి జయకుమార్‌ సైతం అన్నామలై తీరుపై ఇటీవల కాస్త ఘాటుగానే స్పందించడం, ఢిల్లీలో బీజేపీ నేతలను అన్నాడీఎంకే నేతలు కలవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా, అన్నామలై తీరుపై బీజేపీ పెద్దలకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, వారి ప్రోద్బలం లేకుండా ఆయన అలా మాట్లాడి ఉండరని పళనిస్వామి భావించినట్టు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

మరోవైపు.. ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు రావడంతో ఆ పార్టీ నేతలు తమిళనాడులో సంబురాలు చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో బాణాసంచా కాల్పి సంబురాలు జరుపుకుంటున్నారు. 

అన్నాడీఎంకే ప్రకటనపై తమిళనాడు బీజేపీ చీఫ్‌ కే. అన్నామలై స్పందించారు. ప్రస్తుతం తాను దుర్గ పూజలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని స్పష్టం చేశారు. దీనిపై తర్వాత మాట్లాడుతానని తెలిపారు. 

ఇది కూడా చదవండి: మీరు డమ్మీ సీఎం, అబద్దాల కోరు.. అందుకే పక్కన పెట్టేశారు

Advertisement

What’s your opinion

Advertisement