తల్లిదండ్రులకు చిన్నారుల అప్పగింత

29 Oct, 2013 00:56 IST|Sakshi

 

= డీఎన్‌ఏ ప్రకారం పద్మకు ఆడపిల్ల .. విశాలాక్షికి మగపిల్లవాడి అప్పగింత
 = కన్నీటి పర్యంతమైన చిన్నారుల తల్లిదండ్రులు
 = విమ్స్ వైద్యుల తప్పిదానికి రెండు నెలల తర్వాత తెర

 
సాక్షి, బళ్లారి : విమ్స్ ఆస్పత్రిలో తారుమారైన చిన్నారులు వైనంపై రెండు నెలలుగా సాగుతున్న గందరగోళానికి ఎట్టకేలకు సోమవారం తెరపడింది. విమ్స్‌లో  ప్రసవించిన ఇద్దరు తల్లులకు మగపిల్లవాడిని కన్న తల్లికి ఆడపిల్లను, ఆడపిల్లను కన్న తల్లికి మగపిల్లవాడిని అప్పగించిన సంఘటన ఆగస్టు చివరి వారంలో జరిగింది. డీఎన్‌ఏ రిపోర్ట్ ద్వారా విమ్స్‌లో చిన్నారులను మార్పు చేసినది నిజమేనని తేల్చడంతో కోర్టు సమక్షంలో చిన్నారులను అప్పగించేందుకు తీర్మానించారు. ఈ నేపథ్యంలో సోమవారం నగరంలోని జిల్లా కోర్టులో సెకెండ్ అడిషనల్ జడ్జి జరినాతాజ్ ఇరు పక్షాల న్యాయవాదుల  వాదనలను విన్న తర్వాత డీఎన్‌ఏ రిపోర్ట్ ప్రకారం పద్మకు ఆడపిల్లను, విశాలాక్షికి మగపిల్లవాడిని అప్పగించారు.
 
చిత్రదుర్గం జిల్లా మొళకాల్మూరు తాలూకా జాగీరబుడ్డేనహళ్లి గ్రామానికి  చెందిన పద్మ, బళ్లారి తాలూకా వద్దట్టి గ్రామానికి చెందిన విశాలాక్షి ఆగస్టు చివరి వారంలో బళ్లారి విమ్స్ ఆస్పత్రిలో కాన్పు అయ్యారు. పద్మ ఆడపిల్లను ప్రసవిస్తే మగపిల్లవాడిని, విశాలాక్షి మగపిల్ల వాడికి జన్మనిస్తే ఆడపిల్లను అప్పట్లో అప్పగించారు. ఈ విషయం తల్లిదండ్రులకు డిశ్చార్జి సమయంలో ఇచ్చిన సర్టిఫికెట్ ద్వారా తెలియడంతో విమ్స్ ఆస్పత్రిలో పెద్ద గందరగోళానికి తెర లేచింది. దీంతో విమ్స్ ఉన్నతాధికారులు డీఎన్‌ఏ పరీక్షకు పంపారు.

డీఎన్‌ఏ పరీక్షల్లో విమ్స్ సిబ్బంది చేసింది తప్పని తేల్చింది. డీఎన్‌ఏ పరీక్షల్లో వచ్చిన నివేదిక ప్రకారం కోర్టు ద్వారా ఆడపిల్లను కన్నవారికి ఆడపిల్ల, మగపిల్లవాడిని కన్నవారికి మగపిల్లవాడిని అప్పగించారు.  ఈ సందర్భంగా విశాలాక్షి మాట్లాడుతూ ఎదురుగా ఉన్న పసికందు తాను ప్రసవించినదేనని తెలిసినా, ఆ చిన్నారి ఏడ్చినా తాను ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

డీఎన్‌ఏ పరీక్షల్లో మగపిల్లవాడిని తనకు అప్పగించాలని తేల్చడంతో (కోర్టు ద్వారా) తనకు న్యాయం జరిగిందన్నారు. పద్మ మాట్లాడుతూ డాక్టర్లు చేసిన తప్పులకు రెండు నెలలుగా నరకయాతన అనుభవించాము. రెండు నెలలుగా ఎంతో అనురాగంగా చూసుకున్న చిన్నారిని ఈ రోజు వదలుకోవాల్సి వచ్చింది. పేదలు విమ్స్ ఆస్పత్రికి వస్తే పెద్ద మోసం చేస్తున్నారని కంటతడి పెట్టారు.
 

మరిన్ని వార్తలు