ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై హత్యాయత్నం.. దాడిచేసింది వారే..!

23 Nov, 2023 11:44 IST|Sakshi

కత్తితో దాడి చేసిన యువతి తల్లిదండ్రులు, సోదరుడు

పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు

వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న యువకుడిపై యువతి తల్లితండ్రులతో పాటు సోదరుడు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కత్తులతో దాడి చేయడంతో యువకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వలిగొండ మండలం వేములకొండకు చెందిన యాట నవీన్‌ అదే గ్రామానికి చెందిన ఎలగందుల మానస ప్రేమించుకుని 15 మాసాల క్రితం ఇళ్ల నుంచి వెళ్లి వివాహం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగులుగా జీవనం సాగిస్తున్నారు. బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నవీన్‌ బుధవారం వలిగొండ మధిర గ్రామం మల్లేపల్లికి వచ్చాడు. దహనసంస్కారాలు పూర్తయిన తర్వాత నవీన్‌ స్వగ్రామం వేములకొండకు వచ్చాడు. సాయంత్రం ఇంటి సమీపంలోని వాటర్‌ ఫిల్టర్‌ వద్ద మిత్రులతో కలిసి మాట్లాడుతున్నాడు.

విషయం తెలుసుకున్న మానస తల్లిదండ్రులు మార్కండేయ, సరస్వతి, సోదరుడు మత్స్యగిరి ముగ్గురు కలిసి కత్తితో అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు నవీన్‌ను పట్టుకోగా ఒకరు కత్తితో అతడి శరీరంపై ఇష్టానుసారంగా పొడిచారు. ఒకరి తర్వాత మరొకరు నవీన్‌ శరీర భాగాలపై దాడి చేసి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న నవీన్‌ను స్థానికులు, కుటుంబ సభ్యులు తొలుత వలిగొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు.

అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం నవీన్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వలిగొండ ఎస్‌ఐ ప్రభాకర్‌ తెలిపారు.

ఇది చదవండి: జీవితం మీద విరక్తితో.. వివాహిత తీవ్ర నిర్ణయం..!

మరిన్ని వార్తలు