ప్రీతీరాఠీ కేసు నిందితుడికి బెయిల్

10 Aug, 2013 01:38 IST|Sakshi
 
 ముంబై: ప్రీతీరాఠీ అనే ఢిల్లీ యువతిపై యాసిడ్ దాడి కేసులో అరెస్టయిన యువకుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉద్యోగంలో చేరడానికి మే రెండున నగరానికి వచ్చిన ఈమెపై బాంద్రా రైల్వే స్టేషన్‌లో యాసిడ్‌దాడి జరగడం తెలిసిందే. దీంతో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు బాంబే ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే జూన్ ఒకటిన మరణించింది. అయితే ఈ కేసులో నిందితుడు పవన్‌కుమార్ గహ్లాన్‌ను పోలీసులు కేవలం అనుమానంపైనే అరెస్టు చేశారని, ఇతనికి వ్యతిరేకంగా ఆధారాలేవీ లేవని పేర్కొంటూ న్యాయమూర్తి సాధనా జాదవ్ బెయిల్ మంజూరు చేశారు. 
 
 నిందితుడు రూ.15 వేల విలువైన బాండు సమర్పించాలని ఆదేశించారు. యాసిడ్ దాడి జరగడానికి నాలుగు రోజులముందు ప్రీతి ఆరోగ్యం గురించి ఇతడు తన సోదరిని అడిగినందుకే  అరెస్టు చేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రీతి లేదా ఆమె తండ్రి కూడా గహ్లాన్ ప్రమేయం లేదని చెప్పిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఈ కేసులో సత్యం అనే యువకుణ్ని పోలీసులు ప్రశ్నించినా, చివరికి వదిలేశారు. అంకుర్ అనే యువకుడి ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించలేదు. వీరు ముగ్గురూ ప్రీతికి పొరుగువారని పోలీసులు తెలిపారు. విచారణ సందర్భంగా ప్రీతి తండ్రి అమర్‌సింగ్ రాఠీ మాట్లాడుతూ దాడి చేసిన వ్యక్తులెవరో పోలీసులకు ఇప్పటికీ తెలియదని, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ప్రజక్తా షిండే స్పందిస్తూ ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. 
మరిన్ని వార్తలు