రోజు రోజుకు దిగజారుతోంది..పట్టించుకోరా: బాంబే హైకోర్టు సీరియస్‌  

1 Nov, 2023 09:14 IST|Sakshi

ముంబై: నగరంలోని గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) క్షీణించడంపై బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి డికె ఉపాధ్యాయ, జస్టిస్‌ ఆరిఫ్‌ డాక్టర్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు, బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ), సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (సీపీసీబీ)ల వివరణ కోరింది.

ముంబైలో వాయు కాలుష్యం పెరిపోవడంపై నగరవాసులు ముగ్గురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.కె.ఉపాధ్యాయ, జస్టిర్‌ ఆరిఫ్‌ డాక్టర్‌లతో కూడిన బెంచ్‌ ఈ అంశంపై విచారించింది.  ‘‘నగరంలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారో సంబంధిత అధికారులందరూ తెలియ జేయాలి’’ అని కోర్టు ఆదేశించింది తదుపరి విచారణను నవంబర్‌ ఆరవ తేదీకి వాయిదా వేసింది. నగరంలో కాలుష్యాన్ని అరికట్టడానికి, గాలి నాణ్యతను పెంచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, బృహన్ముంబై పాలక సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్లు – అమర్‌ బాబాన్‌ టికే, ఆనంద్‌ ఝా మరియు సంజయ్‌ సర్వే – తమ  వాజ్యంలో కోరారు. ముంబైలో విచ్చలవిడిగా నిర్మాణ కార్యకలాపాలు, తగినంత పచ్చదనం లేకపోవడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని, ఇది నివాసితులపై, పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వారు పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు