అసూయతో ఆమెపై యాసిడ్ పోసి చంపేశాడు

6 Sep, 2016 16:32 IST|Sakshi
అసూయతో ఆమెపై యాసిడ్ పోసి చంపేశాడు

ముంబై: ఢిల్లీకి చెందిన నర్సు ప్రీతి రతిపై యాసిడ్ దాడి, హత్య కేసులో నిందితుడిగా ఉన్న అంకుర్ పన్వర్ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా ప్రకటించింది. ప్రీతి తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందనే అసూయతో అంకుర్ ఆమెపై యాసిడ్ పోసి, హత్య చేశాడని  కోర్టు  మంగళవారం నిర్ధారించింది. కోర్టు బుధవారం అతనికి శిక్షను ఖరారు చేయనుంది. న్యాయం కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్నామని, తమకు న్యాయం జరిగిందని, దోషికి మరణశిక్ష వేయాలని కోరుతున్నట్టు ప్రీతి తండ్రి అమర్ సింగ్ చెప్పాడు. కాగా తన కొడుకును అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, సీబీఐ దర్యాప్తు చేయించాలని అంకుర్ తల్లి కైలాష్‌ డిమాండ్ చేసింది.

2013లో ప్రీతికి ముంబైలోని కొలబా నావల్ హాస్పిటల్లో (ఐఎన్ఎస్ అశ్విని) స్టాఫ్‌ నర్సుగా ఉద్యోగం వచ్చింది. ప్రీతి ఉద్యోగంలో చేరేందుకు తన కుటుంబ సభ్యులతో కలసి మే 2న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో ఢిల్లీ నుంచి ముంబై వచ్చింది. అదే రైలులో ఆమెకు తెలియకుండా అంకుర్ దొంగచాటుగా (టికెట్ లేకుండా) ముంబై వచ్చాడు. బాంద్రా టర్మినెస్లో ప్రీతి దిగిన వెంటనే అంకుర్ ఆమెపై యాసిడ్ దాడిచేసి పారిపోయాడు. ఈ ఘటనలో ప్రీతి ఊపరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 1న మరణించింది.

ప్రీతికి ముంబైలో ఉద్యోగం రావడంతో ఆమె ఢిల్లీ నుంచి ముంబైకు వెళ్లడం అంకుర్ ఇష్టంలేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రీతిని పెళ్లిచేసుకోవాలని అతను ఆశపడగా, ఆమె తన కెరీర్ దృష్ట్యా నిరాకరించింది. ప్రీతి ముంబైకు వెళ్లకుండా ఆపేందుకు అంకుర్ ప్రయత్నించగా, అతని అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆమె ముంబైకి బయల్దేరింది. ప్రీతిపై యాసిడ్ దాడి చేయాలని అంకుర్ ముందస్తుగా పథకం వేసుకున్నాడు. ఏప్రిల్ 2న అతను యాసిడ్ కొన్నాడని దర్యాప్తులో తేలింది. ముంబైలో ప్రీతిపై దాడిచేసిన తర్వాత అదే రైల్లో ఢిల్లీకి తిరిగివెళ్లాడు.

మరిన్ని వార్తలు