తెలుగు ఔన్నత్యాన్ని కాపాడాలి

24 Mar, 2014 00:29 IST|Sakshi

తిరువళ్లూరు, న్యూస్‌లైన్:
 ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న తెలుగుభాష ఔన్నత్యాన్ని, సంప్రదాయాలను తెలుగు ప్రజలు ఐకమత్యంగా కాపాడుకోవాలని శ్రీవెంకటేశ్వరా తెలుగు మాధ్యమిక పాఠశాల కరస్పాండెంట్ వెంకటరమణ పిలుపునిచ్చారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని కామరాజర్‌నగర్ ప్రాంతంలో ఉన్న తెలుగు మాధ్యమిక పాఠశాల 53వ వార్షికోత్సవం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది.
 
  దీనికి వెంకటేశ్వరా పాఠశాల ట్రస్టీ అధ్యక్షుడు నరసింహులు నాయుడు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కర స్పాండెంట్ వెంకటరమణ, విశిష్ట అతిథులుగా మద్రాసు మెరైన్ సంస్థల అధ్యక్షుడు రఘువరన్, వెంకటేశ్వరా ఫైనాన్స్ కంపెనీ అధ్యక్షుడు మహేంద్రబాబు హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా గుడిమెట్ల చెన్నయ్య, శ్రీరామచంద్రమూర్తి హాజరు కాగా పాఠశాల వార్షిక నివేదికను ప్రధానోపాధ్యాయురాలు అనిత ప్రవేశపెట్టారు.
 
 వెంకటరమణ మాట్లాడుతూ ఐకమత్యంగా ఉన్న తెలుగు రాష్ట్రాన్ని వేరు చేసినా, తామంతా తెలుగు ప్రజలుగా కలిసే వుంటామని స్పష్టం చేశారు. అనంతరం నరసింహులు నాయుడు మాట్లాడుతూ, భాషపై అభిమానంతో తెలుగు మాధ్యమాన్ని ఎంచుకుని చదువుతున్న పిల్లలను చూసి గర్వపడుతున్నట్టు తెలిపారు. తెలుగులోని తియ్యదనాన్ని రుచిచూసిన వారు తెలుగును వదులుకోరన్న విశ్వాసం తనకు వెంకటేశ్వరా పాఠశాలలోని విద్యార్థులను చూస్తుంటే కలుగుతుందన్నారు.
 
 కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ తమిళనాడులో తెలుగు భాషా అభిమానులకు కొదవలేదన్న విషయం ఆవడి శ్రీవెంకటేశ్వరా పాఠశాల విద్యార్థులు నిరూపించారని ప్రశంసించారు.  ప్రైవేటు పాఠ శాలలకు దీటుగా వెంకటేశ్వరా పాఠశాలలో వార్షికోత్సవం జరుపుకోవడంపై ఆయన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. వార్షికోత్సవానికి హాజరైన శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ, తెలుగులోని తియ్యదనాన్ని గుర్తించే తమిళ కవులు సుందరతెలుగుగా అభివర్ణించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
 
 పోటీల్లో విజయం సాధించిన వారికి అతిథులు బహుమతులను అందజేశారు. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.  పాఠశాలలో ప్రతిభ కనబరుస్తున్న ఎనిమిదో తరగతి విద్యార్థి సునీత ఉన్నత విద్యకు అవసరమయ్యే అన్ని ఖర్చులను తామే భరిస్తామని పాఠశాల నిర్వాహకులు వెల్లడించారు. ఉపాధ్యాయులు లత,  చారుమతి, పి. ధనంజయన్, రాఘవరెడ్డితో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు