సిలిం‘డర్’ | Sakshi
Sakshi News home page

సిలిం‘డర్’

Published Mon, Mar 24 2014 12:25 AM

సిలిం‘డర్’

  •     పక్షం రోజులు దాటినా... సరఫరా కాని బండ
  •      ఆధార్ బంధం వీడగానే పేరుకున్న పెండెన్సీ
  •      సిటీలో రీఫిల్ పెండెన్సీ.. రెండున్నర లక్షల పైనే
  •  మహానగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన రాంబాబు ఈ నెల 4వ తేదీన వంట గ్యాస్ రీఫిల్ కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారు. పక్షం రోజులు దాటినా ఇంటికి గ్యాస్ బండ సరఫరా కాలేదు. సంబంధిత డీలర్‌కు కాల్ చేస్తే బుకింగ్ తేదీ అడిగి మీ వంతు వచ్చేసరికి మరో రెండు మూడు రోజులు పడుతుందని సమాధానం ఇచ్చారు. ఇది ఒక రాంబాబు బాధే కాదు.. నగరంలోని సుమారు రెండున్నర లక్షల మంది గృహ వినియోగదారులు ఎదుర్కొంటున్న  వంట గ్యాస్ సమస్య.       
     
    మహానగరంలో మళ్లీ వంటగ్యాస్ పెండెన్సీ సమస్య తిష్ట వేసింది. ఒకవైపు వంటగ్యాస్‌కు ఆధార్ బంధం తెగడం.. మరోవైపు ఆర్థిక సంవత్సరం నెలాఖరు కావడంతో రీఫిల్లింగ్ బుకింగ్‌ల పెండెన్సీ ఒకేసారి పెరిగిపోయింది. పక్షం రోజుల క్రితం బుకింగ్ చేసిన వారికి సైతం గ్యాస్ బండ అందని ద్రాక్షగా తయారైంది. వంటగ్యాస్‌కు డీబీటీ రద్దు పురస్కరించుకొని గత నెల ఆఖరు నుంచి ఈ నెల పదో తేదీ వరకూ ఆన్‌లైన్‌లో జరిగిన బుకింగ్‌లన్నీ రద్దు చేసి తిరిగి కొత్త సాఫ్ట్‌వేర్ కింద డీలర్లే రీబుకింగ్ చేయడం సమస్యకు కారణమైంది.

    ఈ నేపథ్యంలో డీలర్లు సిలిండర్ల సరఫరాను సైతం నిలిపివేయడంతో పెండింగ్ సిలిండర్ల సంఖ్య మూడు నాలుగింతలైంది. మరోవైపు ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో ఏడాది కోటాలో మిగిలిన సబ్సిడీ సిలిండర్ల కోసం వినియోగదారులు పెద్ద సంఖ్యలో బుక్ చేసుకొవడంతో సమస్య మరింతగా జటిలంగా తయారైంది. దీంతో  హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్ల పరి దిలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన ఏజెన్సీల్లో సుమారు రెండున్నర లక్షలకు పైగా పెండెన్సీ పెరిగిపోయినట్లు తెలుస్తోంది.

    జంట జిల్లాల్లో కలిపి సుమారు 28.21 లక్షల ఎల్పీజీ వినియోగదారులు ఉం డగా, అందులో 40 శాతం వరకు సింగిల్ సిలిండర్లు, మిగిలినవి డబుల్ సిలెండర్ వినియోగదారులు ఉన్నారు. తాజాగా సింగిల్ సిలిండర్లు కలిగిన వినియోగదారులు పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారైంది.
     
    కారణమిదీ..
     
    వంటగ్యాస్‌కు నగదు బదిలీని రద్దు చేసి నేరుగా వినియోగదారులకు సబ్సిడీ సిలిండర్ అందించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పాత పద్ధతిలో సాఫ్ట్‌వేర్ మార్పిడి తప్పలేదు. ఇదే వంట గ్యాస్ పెండెన్సీ సమస్యకు ప్రధాన కారణమైంది. ఈ నెల పదో తేదీ వరకూ సాఫ్ట్‌వేర్ మార్పిడికి సమయం పడింది. గత నెలలో బుక్ చేసుకున్నా... ఈ నెల ఒకటో తేదీ నుంచి సరఫరా జరిగితే మాత్రం రూ.441 ధరతో సబ్సిడీ సిలిండర్‌ను అందజేయాల్సి ఉంది.

    నేరుగా రాయితీ సిలిండర్ల సరఫరా బిల్లుల జారీ సాఫ్ట్‌వేర్ ఈ నెల పదో తేదీ వరకూ సాధ్యం కాలేదు. దీంతో గత నెలాఖరులో బుకింగ్ అయి సిలిండర్ సరఫరా కాని వారితోపాటు ఈ నెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకూ చేసుకున్న బుకింగ్‌లన్నింటినీ డీలర్లు రద్దు చేసి మళ్లీ రీబుకింగ్ చేశారు. వీటికి అదనంగా పదోతేదీ నుంచి అయిన బుకింగ్‌లతో పెండెన్సీ సంఖ్య పెరిగింది.

    పదో తేదీ తర్వాత సబ్సిడీ ధరకే సిలిండర్ తీసుకోవచ్చనే భావంతో గత నెల చివరి వారం నుంచి చాలామంది ఆధార్ లేని వినియోగదారులు బుకింగ్‌లను వాయిదా వేసుకున్నారు. కొందరు బుక్ చేసుకున్నా సిలిండర్ ఇంటికి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి నగదు చెల్లించడం ఇష్టం లేక వెనక్కు పంపించారు. తిరిగి ఈ నెల పదో తేదీ తర్వాత మళ్లీ బుకింగ్ చేయడంతో పెండెన్సీ విపరీతంగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది.
     
     సమస్యను త్వరలో పరిష్కరిస్తాం
     డీబీటీ రద్దుతో పాత పద్దతిలో సాఫ్ట్‌వేర్ మార్పిడికి కొంత సమయం పట్టింది. దీంతో పెండెన్సీ పెరిగిపోయాయి. ప్రస్తుతం సప్లై పెరిగిన కారణంగా పెండెన్సీ సంఖ్య కూడా  తగ్గు ముఖం పట్టింది. మరోమూడు నాలుగు రోజుల్లో పెండెన్సీ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం ఖాయం.
     - అశోక్, అధ్యక్షుడు,  హైదరాబాద్ వంట గ్యాస్ డీలర్ల సంఘం

Advertisement
Advertisement