23న ఒకే వేదికపై రాజ్, అమితాబ్ !

21 Dec, 2013 00:12 IST|Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేలిద్దరూ సోమవారం ఒకే వేదికపై దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా వీరి మధ్య నెలకొన్న వివాదాలకు తెరపడి సయోధ్య కుదిరిందని భావిస్తున్నారు. 2008లో జరిగిన ఓ కార్యక్రమంలో అమితాబ్ సతీమణి, బాలీవుడ్ నటి అయిన జయా బచ్చన్ మాట్లాడుతూ ‘నాది యూపీ.. నేను హిందీలోనే మాట్లాడతానని’ ప్రకటించింది. ఆమె వ్యాఖ్యల అనంతరం మరాఠీ ప్రజలకోసం పోరాడుతున్న రాజ్ ఠాక్రే, బచ్చన్ కుటుంబీకుల మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి.
 
 ఆ సమయంలో జయా బచ్చన్ తరఫున అమితాబ్ క్షమాపణ కూడా చెప్పారు. అయినప్పటికీ ఆ సంఘటన అనంతరం రాజ్, అమితాబ్‌ల మధ్య దూరం ఏర్పడింది. అయితే తాజాగా సోమవారం జరగనున్న ఓ కార్యక్రమం కోసం ఎమ్మెన్నెస్ తరఫున అమితాబ్‌కు స్వాగత పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘ఎమ్మెన్నెస్ చిత్రపట్ (చలనచిత్ర) సేన’ ఆధ్వర్యంలో చలనచిత్ర పరిశ్రమ 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మాటుంగా షణ్ముఖానంద్ హాల్‌లో సోమవారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమితాబ్ బచ్చన్ హాజరుకానున్నారు. మరోవైపు ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతకుముందు వీరిద్దరూ 2008లో జరిగిన శివసేన అధినేత బాల్ ఠాక్రే ఫొటో బయోగ్రఫీ విడుదల కార్యక్రమంలో కలసి పాల్గొన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు