అనుకున్నట్లే ఏకగ్రీవం

13 Jun, 2020 07:38 IST|Sakshi

రెండోసారి పెద్దల సభకు దేవెగౌడ, మొదటిసారి ఖర్గే  

అనూహ్యంగా బీజేపీ నుంచి కొత్తవారికి అవకాశం 

సాక్షి, బెంగళూరు : అంతా ఊహించినట్టే జరిగింది. రాజ్యసభ ఎన్నికల్లో ఎలాంటి అద్భుతాలు జరగలేదు. రాజ్యసభ ఎన్నికలు రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిశాయి. ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీలోని బలాబలాల ఆధారంగా బీజేపీ రెండు స్థానాలు, కాంగ్రెస్, జేడీఎస్‌ పార్టీలు చెరొక స్థానాన్ని దక్కించుకున్నాయి. శుక్రవారం రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత రాజ్యసభ నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్థులే బరిలో ఉండడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటిస్తూ డిక్లరేషన్‌ విడుదల చేసింది.

కర్ణాటక విధానసభ ముఖ్య కార్యదర్శి విశాలాక్షి రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఆదేశాలు జారీచేశారు. జేడీఎస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన హెచ్‌డీ దేవెగౌడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన తన జీవితంలో రెండోసారి పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ నుంచి సీనియర్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మల్లికార్జున ఖర్గే తొలిసారి రాజ్యసభ ఎన్నికల్లో అడుగుపెట్టనున్నారు. కాగా దేవెగౌడ, ఖర్గేలు గత లోకసభ ఎన్నికల్లో ఓటమి పాలయిన సంగతి తెలిసింది. చదవండి: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్ట్‌ 

లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయి ప్రస్తుతం రాజ్యసభకు ఎంపికవ్వడం విశేషం. ఇక బీజేపీ నుంచి ఈరణ్ణ కడాడి, అశోక్‌ గస్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెళగావి జిల్లాకు చెందిన 54 ఏళ్ల ఈరణ్ణ, రాయచూరు జిల్లాకు చెందిన 55 ఏళ్ల అశోక్‌ గస్తీలు రాజ్యసభకు ఎన్నికవ్వడం ఇదే తొలిసారి. కాగా, వీరిరువురి పేర్లను రాజ్యసభకు ఖరారు చేస్తూ బీజేపీ అధిష్టానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన మరో వ్యక్తి అభ్యర్థిత్వాన్ని ప్రొపొజల్‌ సంతకం లేని కారణంతో అతని నామినేషన్‌ను తిరస్కరించారు. చదవండి: అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్‌ 

మరిన్ని వార్తలు