దుండగుల కాల్పుల్లో విద్యావేత్త కల్బుర్గీ దుర్మరణం

30 Aug, 2015 12:36 IST|Sakshi
దుండగుల కాల్పుల్లో విద్యావేత్త కల్బుర్గీ దుర్మరణం

ప్రముఖ విద్యావేత్త, హంపి కన్నడ యూనివర్సిటీ మాజీ వీసీ ఎం.ఎం. కల్బుర్గీ (77) ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. ధార్వాడ పట్టణం కల్యాణ నగర్ లోని ఆయన నివాసంలోకి చొరబడ్డ దుండగులు అతి సమీపంగా కాల్పులు జరిపి పారిపోయారు. ఛాతి భాగం నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుండగా  కల్బుర్గీని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు నిర్ధారించారు.

హత్య జరిగిన సమయంలో కల్బుర్గీ తన కుటుంబసభ్యులతో కలిసి అల్పాహారం తింటున్నారు. కాల్పుల ప్రత్యక్ష సాక్షి, కల్బుర్గీ కుమార్తె ఇలా చెప్పారు.. 'ఉదయం సుమారు 8:50 గంటలకు నాన్నతోపాటు అందరం టిఫిన్ చేస్తున్నాం. చప్పుడు కాకుండా మా ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు ముసుగు వ్యక్తులు చేతుల్లో ఉన్న తుపాకితో నాన్నపై కాల్పులు జరిపాపి ఒక్క ఉదుటన పారిపోయారు. షాక్ నుంచి తేరుకుని నాన్నను ఆసుపత్రికి తీసుకెళ్లాం. కానీ అప్పటికే ఆయన చనిపోయారని డాక్టర్లు చెప్పారు' అని హత్యజరిగిన తీరును వివరించారు.

అద్భుత రచనలతో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా పొందిన ఆయన విగ్రహారాధనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇది గిట్టని ఛాందసవాదులే కల్బర్గీని హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు