గుండె దడ!

13 Oct, 2014 01:33 IST|Sakshi
గుండె దడ!
  • పదవుల పంపకంపై సమావేశం
  •  నేతలతో చర్చించిన సిద్ధు, పరమేశ్వర్
  •  ఎన్నికల్లో  ఓడినవారిని గుర్తించాలని పలువురి విజ్ఞప్తి
  •  సామర్థ్యాన్ని బట్టి కేటాయిస్తామన్న సీఎం
  •  ఓడిన అందరికీ కేటాయించలేమన్న  కేపీసీసీ చీఫ్
  • సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ నేతల్లో గుండె దడ పెరిగిపోతోంది. ఆశించిన పదవులు దక్కుతాయో లేదో అన్న ఆందోళన ఆశావహుల్లో చోటు చేసుకోగా, పదవులు కట్టబెట్టడంలో ఏమైనా పొరబాట్లు జరిగితే పార్టీలో అసంతృప్తి పెరిగిపోయే ప్రమాదముందని అగ్రనేతలతో దడ మొదలైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో తమకూ తగిన ప్రాధాన్యతనివ్వాలంటూ గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్‌తో నెల నరేంద్రబాబు, బి.ఎల్. శంకర్, అంజనామూర్తితో సహ 60 మంది ఆదివారం సమావేశమై తమ ప్రధాన డిమాండ్‌ను వినిపించారు.
     
    తమ అభ్యర్థనను మన్నిస్తే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టుకునేందుకు అవకాశముంటుందని సూచన చేశారు. అతి తక్కువ ఓట్ల తేడాతో తాము ఓటమి పాలయ్యామని, ఈ విషయాన్ని గమనిస్తే తమకు నైతికంగా ప్రజల మద్దతు ఉన్నట్లు స్పష్టమవుతోందని వివరించారు. ఎమ్మెల్యేలకు మాత్రమే నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యతనివ్వడం సబబుగా లేదని పేర్కొన్నారు.

    నియోజకవర్గాల అభివృద్ధి నిధుల విడుదల, ప్రభుత్వ కార్యాక్రమాల్లో వారికే పెద్ద పీట వేస్తున్నారని నిష్టూరమాడారు. కనీసం నామినేటెడ్ పోస్టుల విషయంలోనైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. దీనిపై సిద్ధరామయ్య మాట్లాడుతూ... శక్తిసామర్థ్యాలను బట్టి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని అన్నారు. ఇదే సమయంలో పరమేశ్వర్ మాట్లాడుతూ.. ఓటమి పాలైనవారందరికీ నామినేటెడ్ పోస్టులను ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు.

    అయితే స్థానికంగా వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి మొత్తం పోస్టుల్లో 30 శాతం వరకూ కేటాయిస్తామని వివరించారు. మిగిలిన వాటిలో కొన్ని సీనియర్లకు, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారికి, మంత్రి పదవులు ఆశిస్తున్న వారికి కేటాయించబోతున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో తాము ఆశించిన పదవులు దక్కలేదన్న అక్కసుతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు