తుఫాన్ ధాటికి విలవిల | Sakshi
Sakshi News home page

తుఫాన్ ధాటికి విలవిల

Published Mon, Oct 13 2014 1:37 AM

తుఫాన్ ధాటికి విలవిల

 బొబ్బిలి: పట్టణంలో హుదూద్ ధాటికి పలు భారీ వృక్షాలు నేలకూలాయి. టీటీడీ కళ్యాణ మండపం, ఆర్‌అండ్ బీ అతిథిగృహం, పెట్రోల్ బంకు వద్ద, మార్కెట్‌యార్డు వృక్షాలు కూలిపోయాయి.  వీటిని తక్షణమే తొలగించినట్లు ఆర్‌అండ్‌బీ జేఈ తిరుపతిరావు తెలిపారు. కాగా పట్టణంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్‌కో డీఈ మసీలామణి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు దాదాపు 100 వరకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు ప్రాథమిక సమాచారం. 6 ట్రాన్స్‌ఫార్మర్లు పాడయ్యాయి.  పెందుర్తిలో విద్యుత్ సరఫరా కేంద్రం మరమ్మత్తులకు గురికావడంతో 2,3రోజుల వరకు బొబ్బిలిలో విద్యుత్ సరఫరా ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. రామభద్రపురం: మండలంలోని ఆదివారం తెల్లవారుజాము నుంచి విద్యుత్ సరఫరా లేక పలు గ్రామాలు అం ధకారంలో ఉన్నాయి. భారీ వర్షంతో పలువురు ఇబ్బం దులు పడుతున్నారు. తుఫాన్ ప్రభావంతో మండలంలోని ఎడతెరపి లేని వర్షం కురిసింది. 38 మిల్లీ మీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీవర్షాల కు వరి,చెరకు, పత్తి ,జొన్న పంటలు నేలమట్టమయ్యాయి.
 
 తహశీల్దార్ కార్యాలయంపై కూలిన చెట్లు
 బొబ్బిలిరూరల్: స్థానిక తహశీల్దార్ ఆవరణలో  పెద్ద చెట్లు ఆదివారం కార్యాలయంపై  కూలిపోయాయి. దీం తో కార్యాలయ సిబ్బందితో పాటు అధికారులు పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. చెట్టు పైభాగం కొంతమేర తహశీల్దార్ కార్యాలయంపై పడగా, ఓ కొమ్మకొంత భాగంగా కారిడార్‌పై ఉండే పైకప్పులోకి చొచ్చుకుపోయింది. కొంతభాగం కార్యాలయం పాక్షికంగా దెబ్బతింది.  చెట్టుకూలిన సమయంలో హెల్ప్‌డెస్క్ నిర్వహిస్తున్న డీటీ కేబీ ఆచారి, ఆర్‌ఐ సాయికృష్ణ, సీనియర్ అసిస్టెంట్ స్వర్ణలత, వీఆర్వోలు,సిబ్బంది ఉన్నారు. శిథిలావస్థలో ఉన్న కార్యాలయం కూలిపోతే పెద్ద ప్రమాదమే జరిగేది.  మరో అరగంటలో మరోచెట్టు కార్యాలయం మరోవైపు కూలిపోయింది. కొన్నికొమ్మలు తొలగించారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వాసిరెడ్డి విగ్రహం వద్ద ఉన్న ఓ హోట్‌ల్ వద్ద చెట్టుకొమ్మ పడింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
 
 నీట మునిగిన పొలాలు
 మండలంలో పలు గ్రామాల్లో హుదూద్ తుఫాన్‌కు పొలాలు ముంపునకు గురయ్యాయి. ఆదివారం కురిసిన వర్షాలకు పంటలకు పెద్దగా నష్టం లేకపోయినా సోమవారం నాటి పరిస్థితిని బట్టి నష్టం అంచనా వేయాల్సి ఉంది. ఇప్పటికే వరి, చోడి పంటలు నేలకొరిగిపోయాయి. కోమటిపల్లి, పారాది, గొర్లెసీతారాంపురం గ్రామాల్లో పంట నీట మునిగింది.
 
 విద్యుత్ అంతరాయంతో అవస్థలు
 గుమ్మలక్ష్మీపురం: హుదూద్ తుఫాన్ కారణంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో విద్యుత్ సరఫరాలేని కారణంగా అంధకారం నెలకొంది. ఏజెన్సీలో బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు కూడా పనిచేయలేదు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీటి సమస్య నెలకొంది.
 
 విస్తారంగా వర్షాలు
 గరుగుబిల్లి: హుదూద్ తుఫాన్ కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో  శనివారం అర్ధరాత్రి నుంచి ఈదురుగాలులుతో పాటు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని అధికారులు గ్రామాల్లో దండోరా వేశారు.  మండలంలోని పెద్దూరు, రావుపల్లి, బివి పురం, రావివలస, నాగూరు, చినగుడబ, ఉల్లిబద్ర, లఖనాపురం గ్రామాల్లో  వరి పైర్లు నేలకొరిగాయి. అరటి, చెరుకు, మొక్కజొన్న పంటలు కూడా నేలవాలడంతో నష్టం ఏర్పడిందని పలువురు రైతులంటున్నారు. తుఫాన్ కారణంగా ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా వీఆర్‌ఓలను అప్రమత్తం చేసినట్లు తహశీల్ధార్ కె.సూర్యనారాయణ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల నుంచి ఇంతవరకూ ఎటువంటి ఫిర్యాదులు రానప్పటికీ స్థానికంగా ఉండే వీఆర్‌ఓలను అప్రమత్తంచేసినట్లు తెలిపారు. తుఫాన్ కారణంగా ఇళ్లు కూలిపోయినా,పంటలకు నష్టం వాటిల్లినా,చెరువులకు గండ్లుపడినా తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు చేపడతామన్నారు.  నిరాశ్రయులకు తోటపల్లిలోని జట్టు ఆశ్రమంలో పునరావాస కేంద్రంను ఏర్పాటు చేశామని చెప్పారు.  ఎంపీడీ ఓ పార్వతి,హెచ్‌డీటీ రాధాకృష్ణ తదితరులున్నారు.
 
 ఈదురుగాలిలో కూడిన భారీవర్షం
 కొమరాడ: మండలంలోని ఆదివారం తెల్లవారుజాము 4గంటలనుంచి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసిం ది. ఇళ్లలో నుంచి ఎవరూకూడా బయటకు రాలేదు. అధికారులు ముందస్తుగా దుగ్గి, గుణానపురం, కళ్లికోటలో నిర్వాసిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లే కుండా సదుపాయాలు చేశారు. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆదివారం రాత్రి నాగావళినదిలోకి నీరు అధికంగా చేరే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. ముందస్తుగా అన్ని ఏర్పాట్లు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎస్‌ఐ జె. ధర్మేంద్ర ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.
 
 కూలిన నాలుగు విద్యుత్ స్తంభాలు
 మండలంలోని నాగావళి నది ఆవలివైపువున్న మాదలింగి సమీపంలో నాలుగు విద్యుత్‌స్తంభాలు ఈదురుగాలులకు ఆదివారం కూలిపోయాయి. విద్యుత్  అధికారులు పనుల ను పునరుద్దరిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న చెట్టు కూలిపోయింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement