ఒక్క మంత్రి కోసం 25 కోట్ల మినహాయింపా?

6 Sep, 2016 19:44 IST|Sakshi
ఒక్క మంత్రి కోసం 25 కోట్ల మినహాయింపా?

న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఒక్క వ్యక్తి ఆస్తికి పన్నును మినహాయించడం కోసం ఏకంగా 750 ఇళ్లపై ఆస్తి పన్నును రద్దు చేసిందని, ఫలితంగా ఇప్పటికే ఈ ఏడాది 2,700 కోట్ల రూపాయల లోటుతో నడుస్తున్న మున్సిపల్ కార్పొరేషన్‌పై మరో 25 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడిందని విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు విజయ్ గోయెల్ కుటుంబానికి ధర్మపురలో ఓ చారిత్రక హవేలి ఉంది. నాలుగంతస్తులుగల ఆ భవంతిలో 13 గదులు ఉన్నాయి. వాటిలో రెస్టారెంట్, స్పా, ఆర్ట్ గ్యాలరీలు కమర్షియల్‌గా నడుస్తున్నాయి. కమర్షియల్ కార్యకలాపాలకుగాను ఇంటిపన్నును, కార్ పార్కింగ్ చార్జీలను ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వసూలు చేస్తూ వస్తోంది. ఈ పన్ను నుంచి మినహాయింపు కావాలని కోరుతూ గోయెల్ కుటుంబ సభ్యులు మున్సిపల్ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
 

 ఆ ఒక్క దరఖాస్తుపైన మాత్రమే స్పందిస్తే విమర్శలు వెల్లువెత్తుతాయని భావించిన కార్పొరేషన్ స్థాయీ సంఘం మొత్తం కార్పొరేషన్ పరిధిలోని 750 చారిత్రక భవనాలను పన్ను పరిధి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకొందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని కార్పొరేషన్ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. 750 భవనాల్లో ఖరీదైన రెస్టారెంట్లు, అతిథి గృహాలు, చేతికళలు, నగల దుకాణాలు నడుస్తున్నాయని, వాటిపై కోట్లలో అద్దె వస్తుండగా, పన్ను మినహాయింపు కల్పించడం అర్థరహితమని ఢిల్లీ ఆప్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కార్పొరేషన్ చర్యపై విరుచుకు పడుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో నడుస్తున్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు