తమిళంలో శంకరాభరణం

13 Mar, 2015 03:31 IST|Sakshi
తమిళంలో శంకరాభరణం

 తమిళసినిమా: భారతీయ అద్భుత సినీ కళా ఖండాల్లో శంకరాభరణం ఒకటని ఘంటాపథంగా చెప్పేయవచ్చు. ఇంకా చెప్పాలంటే కర్ణాటక్ సంగీతాన్ని అతి సామాన్యుడి వద్దకు చేసిన చిత్రాల్లో మొదటి వరసలో ఉండే చిత్రం ఇది. అలాంటి అద్భుత దృశ్య కావ్యానికి దర్శకుడు కె.విశ్వనాథ్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ సృష్టికర్తలు. సంగీతంతో సామాజిక అంశాలను ముడిపెట్టి ఆచారాలన్నవి ఆచరణలో పెడితే చాలు మనుష్యులందరూ ఒక్కటే అంటూ జాతి, మతం లాంటి అంటరానితనానికి పాతరేసిన గొప్ప సందేశాత్మక సంగీత భరిత చిత్రం శంకరాభరణం.
 
  ఈ చిత్రంతోనే గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యంలో ఉన్న నిజమైన గాయకుడు లోకానికి పరిచయం అయ్యారంటే అతిశయోక్తి కాదేమో. 1980లో తెరపైకి వచ్చి చరిత్ర సృష్టించిన శంకరాభరణం దివంగత నటుడు సోమయాజులకు నటి మంజుభార్గవి, రాజాలక్ష్మికి ఇంటి పేరుగా మారిందంటే ఈ చిత్ర చరిత్ర ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. చంద్రమోహన్, అల్లురామలింగయ్య లాంటి ప్రతిభావంతుల నటన శంకరాభరణంకు అదనపు అలంకారం. అప్పట్లో జాతీయ రాష్ట్ర నంది అవార్డులతో పాటు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి విశేష కీర్తిని సంపాదించి పెట్టిన ఈ తెలుగు చిత్రం తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోను విడుదలైన ఘన విజయాన్ని సాధించింది.
 
 ఇదంతా ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే శంకరాభరణం 35 ఏళ్ల తరువాత తమిళ మాటలతో మరోసారి తమిళనాట శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి గాయకుడు ఎస్‌పి బాలసుబ్రమణ్యం, తెలుగులో పాడిన పాటల్ని తమిళంలోనూ ఆలపించడం విశేషం. ఈ తరం కూడా చూడాల్సిన గొప్ప చిత్రం శంకరాభరణం.
 

మరిన్ని వార్తలు