అనంతకు అన్యాయమే! | Sakshi
Sakshi News home page

అనంతకు అన్యాయమే!

Published Fri, Mar 13 2015 3:00 AM

Budget 2015

సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘అనంత’ అభివృద్ధి కోసం చంద్రబాబు ఇచ్చిన హామీలు... ఏడాదిలో హంద్రీ-నీవాను పూర్తి చేస్తామని పదేపదే ప్రభుత్వం వల్లెవేసిన మాటలు.. డ్వాక్రా రుణాలు... నిరుద్యోగులకు ఉద్యోగాలు.. పరిశ్రమల ఏర్పాటు... ఇలా హామీలన్నీ మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి. వారి చెప్పినవన్నీ ఆచరణ సాధ్యం కాదని బడ్జెట్ సాక్షిగా తేలిపోయింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో
 
 ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రెండు, మూడు చిన్న హామీలు మినహా ‘అనంత ’ అభివృద్ధి దిశగా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వేయలేదు. జిల్లాలో సాగునీటి రంగంతో పాటు మౌలిక వసతుల కల్పన, వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధి చూపలేదని యనమల లెక్కల సాక్షిగా తేలింది.
 
 రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి యనమల వెనుకబడిన ‘అనంత’పై ప్రత్యేక దృష్టి సారిస్తారని అంతా భావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు బోలెడు హామీలు ఇవ్వడంతో వాటిలో సగం అమలుకైనా బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని ఆశపడ్డారు. కానీ మాటలతో ఊరించిన ప్రభుత్వం.. కేటాయింపుల్లో ఉసూరుమనింపించింది. ముఖ్యంగా హంద్రీ-నీవా ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని గతేడాది మాట ఇచ్చిన ప్రభుత్వం దాన్ని నిలుపుకోలేకపోయింది. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి దేవినేని ఉమామశ్వరరావు ఏడాదిలోపు హంద్రీ-నీవాను పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు.
 
 ప్రాజెక్టు పూర్తి కావాలంటే వాస్తవంలో రూ.1700 నుంచి 2వేల కోట్లు అవసరం. అయితే బడ్జెట్‌లో రూ.212 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ ఏడాది కరెంటు బిల్లుల బకాయిలే దాదాపు రూ.170 కోట్ల ఉన్నాయి. ఉద్యోగుల జీతాలకు మరో రూ.60-70కోట్లు అవసరం. ఈ క్రమంలో కేటాయించిన బడ్జెట్ ఏ మూలకు సరిపోతుందో, ప్రాజె క్టును ఏడాదిలో ఎలా పూర్తిచేస్తారో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. ఈ ఏడాది 16.5 టీఎంసీల కృష్ణాజలాలు వచ్చినా ప్రధాన కాలువ నుంచి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ లేకపోవడంతో జలాలన్నీ వృథా అయ్యాయి.
 
  వచ్చే ఖరీఫ్ పంటలకైనా సాగునీళ్లు అందాలంటే ఉప, పిల్ల కాలువలు పూర్తిచేయాలి. ప్రభుత్వ బడ్జెట్‌తో ఈ ఖరీఫ్‌కు కూడా సాగునీరు అందదని తేలిపోయింది. పైగా ఈ ప్రాజెక్టుపై సీఎం బావమరది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేకంగా దృష్టి సారించారని, ఏడాదిలోపు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో పొందుపరిచేలా చూసే బాధ్యత తనది అని జిల్లా నేతలతో బాలకృష్ణ బీరాలు పలికినట్లు తెలుస్తోంది.  దీంతో పాటు హెచ్చెల్సీ ఆధునికీకరణకు ఫేజ్-1, ఫేజ్-2కు కలిపి రూ.58కోట్లు మాత్రమే కేటాయించారు.  
 
 మహిళలు... నిరుద్యోగులకు  మరోసారి మోసం:
 అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. జిల్లాలో 54వేల సంఘాలకు రూ.995కోట్ల బకాయిలు ఉన్నాయి. సీఎం అయిన తర్వాత సంఘానికి లక్ష రూపాయల చొప్పున మాఫీ చేస్తానన్నారు. ఇప్పటి వరకూ ఆ హామీ అమలు కాలేదు. ఈ బడ్జెట్‌లోనైనా రుణమాఫీ చేసి మహిళకు అండగా నిలుస్తారనుకుంటే మహిళలను మరోసారి దగా చేశారు. అలాగే నిరుద్యోగులకు కూడా నిరాశే మిగిల్చారు.
 
 టీచర్ల భర్తీ మినహా కొత్త ఉద్యోగాల ప్రస్తావనే బడ్జెట్‌లో లేదు. నిరుద్యోగులకు నెలకు రూ.2వేల భృతి ఇస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు. రైతులు తీసుకున్న వ్యవసాయరుణాల మాఫీపై కూడా ప్రకటన చేయలేదు. నేడు ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రుణమాఫీ రెండో విడతపై ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.
 
 హిందూపురంలో ఎలక్ట్రానిక్ క్లస్టర్:
 జిల్లాలో పారిశ్రామికవాడ, స్మార్ట్‌సిటీ, విమానాశ్రయంతో పాటు హార్టికల్చర్ యూనివర్శిటీతోపాటు ఎన్నో హామీలను చంద్రబాబు గుప్పించారు. అయితే బడ్జెట్‌లో మాత్రం వీటి ప్రస్తావనే చేయలేదు. దీంతో హామీలన్నీ నీటిమూటలే అని తేలిపోయాయి. హిందూపురంలో ఎలక్ట్రానిక్ క్లస్టర్, ధర్మవరంలో కమ్యూనికేషన్ సెంటర్, రేణిగుంట, రాయచెరువు వరకూ రోడ్డు విస్తరణ పనులకు మాత్రమే బడ్జెట్‌లో స్థానం లభించింది. మొత్తం మీద ఈ బడ్జెట్‌లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని పలు రాజకీయపార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
 
 జిల్లా ప్రస్తావనే లేదు
 బడ్జెట్ చూస్తే ప్రకటనలు మినహా ప్రాజెక్టులు కేటాయించడం తమకు చేతకాదని ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. హంద్రీ-నీవాను ఏడాదిలో పూర్తి చేస్తామని 212కోట్లు మాత్రమే కేటాయించడం దారుణం. కరెంటు బిల్లులు, పాతబకాయిలకు కూడా ఇవి సరిపోవు. చేనేతలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు లేదు. కరువును ఎదుర్కొనేందుకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. ఇంత దారుణమైన బడ్జెట్‌ను ఎప్పుడూ చూడలేదు.                    
-విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ
 
 ‘సీమ’కు మేలు చేసే బడ్జెట్
 వ్యవసాయానికి, సాగునీటి రంగానికి పెద్దపీట వేశాం. పట్టిసీమను పూర్తి చేయడం ద్వారా కృష్ణాజలాలను రాయలసీమకు తరలించేందు వీలు ఉంటుంది. సంక్షేమానికి కూడా పెద్దపీట వేశాం. మొత్తంపైన బడ్జెట్‌తో రాయలసీమకు చాలా మేలు జరుగుతుంది.        
 - బీకే పార్థసారథి, ఎమ్మెల్యే, పెనుకొండ
 

Advertisement
Advertisement