విలీనానికి ఓపీఎస్‌ ఓకే

18 Apr, 2017 11:16 IST|Sakshi
విలీనానికి ఓపీఎస్‌ ఓకే

చెన్నై: శశికళ వర్గంలోని అధికార అన్నాడీఎంకేలో చేరేందుకు సిద్ధమని మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌ సెల్వం(ఓపీఎస్‌) సూచనప్రాయంగా ప్రకటించారు. విలీనంపై చర్చలు జరిపేందుకు శశికళ వర్గం కమిటీ ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని పళనిస్వామి వర్గం కూడా ధ్రువీకరించింది. సీనియర్‌ మంత్రులతో కూడిన కమిటీ రెండు వర్గాల విలీనంపై చర్చలు జరుపుతుందని మంత్రి సెల్లూర్‌ రాజు తెలిపారు. రెండాకుల గుర్తును రెండు వర్గాలు కోరుకుంటున్నాయని, పార్టీ గుర్తును దక్కించుకోవాలంటే ఇరువర్గాలు కలిసి పనిచేయాల్సివుంటుందని పేర్కొన్నారు.

‘మేమంతా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల లాంటి వాళ్లం. రెండు వర్గాలు విలీనమయ్యే అవకాశముందని నిన్న పన్నీర్‌ సెల్వం వెల్లడించారు. దీనికనుగుణంగా మేమంతా కూర్చుని, చర్చించుకుని విభేదాలు పరిష్కరించుకుంటామ’ని సెల్లూర్‌ రాజు చెప్పారు. పన్నీర్‌ సెల్వం వర్గం తమ వర్గంలో విలీనమవుతుండడం పట్ల అటవీశాఖ మంత్రి సి. శ్రీనివాసన్‌ సంతోషం వ్యక్తం చేశారు.

తన వర్గాన్ని విలీనం చేసేందుకు పళనిస్వామి ప్రభుత్వానికి ఓపీఎస్‌ రాజీ ఫార్ములా ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది. శశికళ కుటుంబాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా పెట్టాలని ఆయన షరతు విధించినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు