నిర్లక్ష్యం నీడలో ‘బెల్లంపల్లి’

14 Oct, 2016 12:20 IST|Sakshi
బెల్లంపల్లిలోని అడిషనల్ జీఎం కార్యాలయం
బెల్లంపల్లి : కార్మికక్షేత్రం బెల్లంపల్లి తీవ్ర నిరాధరణకు గురవుతోంది. బొగ్గుట్టగా ప్రసిద్ధిగాంచిన ఈప్రాంతం క్రమేపీ ఉనికిని కోల్పోతోంది. బొగ్గు గనులు అంతరించి, జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని తరలించి, విభాగాలను ఎత్తివేయడంతో సింగరేణి చిత్రపటం నుంచి బెల్లంపల్లి కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు కార్మికవర్గాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. 
 
జీఎం కార్యాలయం తరలింపుతో..
బెల్లంపల్లి కేంద్రంగా దశాబ్దాల కాలం పాటు కార్మికవర్గానికి సేవలు అందించిన సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని 2006 మే 1న రెబ్బెన మండలం గోలేటీటౌన్‌షిప్‌నకు తరలించారు. సింగరేణి ఉన్నతాధికారులు కొందరు తీసుకున్న అనాలోచిత విధానాల వల్ల జీఎం కార్యాలయాన్ని బెల్లంపల్లి నుంచి ఎత్తివేశారు. అప్పటి నుంచి క్రమంగా బెల్లంపల్లిలో ఉన్న వర్క్‌షాపు, స్టోర్, ఆటో గ్యారేజ్ తదితర విభాగాలను ఎత్తివేశారు. 18 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్‌హౌజ్‌ను ముంబైకి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీకి అమ్మేశారు. విభాగాలు ఎత్తివేసి, జీఎం కార్యాలయాన్ని తరలించి ఈ ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులను నిర్ధాక్షిణ్యంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేసి బెల్లంపల్లి  ప్రాభవాన్ని తగ్గించారు. 
 
ఏరియాలో సర్దుబాటుతో
బెల్లంపల్లిని కొన్నాళ్ల పాటు గోలేటీ జీఎం కార్యాలయం పరిధిలో ఉంచారు. ఇక్కడ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడపాదడపా సింగరేణి అధికారులు పర్యటించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. రెండేళ్ల క్రితం బెల్లంపల్లిని మందమర్రి ఏరియాలో కలిపారు. బెల్లంపల్లిలోని సింగరేణికి చెందిన సుమారు 5 వేలకుపైబడి క్వార్టర్లు, సివిల్ విభాగం, ఎలక్ట్రిసిటీ, తిలక్‌స్టేడియం, బుధాగెస్ట్‌హౌజ్, ఎల్లందు క్లబ్ మందమర్రి ఏరియా పరిధిలో చేర్చగా, ఏరి యా ఆస్పత్రి నిర్వహణను బెల్లంపల్లి ఏరియా(గోలేటీటౌన్‌షిప్)కు కట్టబెట్టి బెల్లంపల్లిని  రెండు ముక్కలుగా చేశారు. ఈ పరిణామాలతో కార్మికులు అవసరాల కోసం గోలేటీటౌన్‌షిప్, మందమర్రికి వెళ్లాల్సిన పరిస్థితి.
 
చిన్నచూపు
బెల్లంపల్లి ప్రస్తుతం రెండు ఏరియాల పరిధిలో కొట్టుమిట్టాడుతోంది. ఏ ఒక్క ఏరియాకు బెల్లంపల్లిపై ఆధిపత్యం లేకుండా పోయింది. బెల్లంపల్లి పట్ల సింగరేణి యాజమాన్యం చిన్నచూపు చూస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇతర ఏరియాలకు జీవం పోసిన బెల్లంపల్లి ప్రస్తుతం ఉనికిని కోల్పోయి తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ పరిస్థితుల్లో కాసిపేట, శాంతిఖని గనులు బెల్లంపల్లిలో విలీనం చేసి జీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కార్మికవర్గం ముక్తకంఠంతో కోరుతోంది. ఆ తీరుగా చేసినట్లయితే బెల్లంపల్లికి పూర్వవైభవం వచ్చే అవకాశాలు ఉంటాయి. సింగరేణి అధికారులు ఇప్పటికైనా బెల్లంపల్లి భవిష్యత్ కోసం తగిన కార్యాచరణ రూపొందించాలని పలువురు కోరుతున్నారు.
మరిన్ని వార్తలు