సింగరేణి ఎన్నికలు వాయిదా

12 Oct, 2023 04:56 IST|Sakshi

ఈ నెల 28న వద్దు

డిసెంబర్‌ 27న నిర్వహించాలన్న హైకోర్టు

 అదే రోజు ఫలితాలూ వెల్లడించాలన్న ధర్మాసనం

 నవంబర్‌ 30లోగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేయాలి

ప్రభుత్వానికి, కార్మిక శాఖకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌:  సింగరేణి గురింపు సంఘం ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలన్న యాజమాన్యం అభ్యర్థనకు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అంగీకరించింది. డిసెంబర్‌ 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని, నవంబర్‌ 30లోపు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. ఈ ఎన్నికలకు సహకరించాలని, ఆ మేరకు కార్మిక సంఘాలకు స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 29కి వాయిదా వేసింది.

ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమన్న యాజమాన్యం
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించలేమని, గడువు కావాలంటూ యాజమాన్యం గత నెల హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖలు రాశారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది. వరుస పండుగలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని ప్రభుత్వానికి అధికారులు రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించలేమని వారు పేర్కొన్నట్లు వివరించింది.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి.. గతంలో అక్టోబర్‌లో నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని తేల్చిచెప్పారు. యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారు. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ సింగరేణి యాజమాన్యం అప్పీల్‌కు వెళ్లింది. అలాగే సింగరేణి ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మధ్యంతర అప్లికేషన్‌(ఐఏ) దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.

ప్రక్రియ మాత్రం కొనసాగించండి.. 
‘అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు దాదాపు ఆరు జిల్లాల(కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి) పరిధిలోని 13 నియోజకవర్గాల్లోని 15 ట్రేడ్‌ యూనియన్లకు ఎలక్షన్లు అక్టోబర్‌లో నిర్వహించడం సాధ్యం కాదు. ఇందులో మూడు జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. దాదాపు 43,000 మంది ఓటర్లు ఉంటారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌తో పాటు ఇతర పలు శాఖల అధికారులు అసెంబ్లీ ఎన్నికల బిజీలో ఉన్నారు. వీరి సహకారం లేకుండా గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. 700 మంది అధికారులు, సిబ్బంది సాయం కావాల్సి ఉంటుంది.

ఈ పరిస్థితిల్లో కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు మరి కొంత సమయం ఇవ్వాలి’ అని సింగరేణి యాజమాన్యం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న సీజే ధర్మాసనం.. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు డిసెంబర్‌ 27 వరకు సమయం ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గుర్తుల కేటాయింపు తదితర ప్రక్రియను మాత్రం కొనసాగించాలని, నవంబర్‌ 30న తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది. 

మరిన్ని వార్తలు