జైలుకెళ్లిన నేతలను ఎలా నమ్ముతారు

19 Sep, 2016 14:10 IST|Sakshi
జైలుకెళ్లిన నేతలను ఎలా నమ్ముతారు
మాజీ ఎమ్మెల్సీప్రేంసాగర్‌రావు
 
మంచిర్యాల టౌన్ : కార్మికుల డబ్బులు కాజేసిన కెంగర్ల మల్లయ్య, కనకయ్య, మిర్యాల రాజిరెడ్డి ముగ్గురు జైలుకు వెళ్లి వచ్చిన వారేనని, వారని కార్మికులు ఎలా నమ్ముతారని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆదివారం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికులు ఎన్నో ఆశలతో టీబీజీకేఎస్‌కు పట్టం కట్టితే, వారు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారన్నారు.
 
ప్రతి నెలా కార్మికులు వారి సంక్షేమం కోసం రూ.10 చొప్పున వేతనాల్లో నుంచి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న డబ్బులను టీబీజీకేఎస్ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల డబ్బులు కాజేసిన నాయకులను కార్మికులు నమ్మొద్దన్నారు. ఐఎన్టీయూసీ నుంచి టీబీజీకేఎస్‌కు వెళుతున్నప్పుడు వెంకట్రావు ఐఎన్టీయూసీ కార్మికుల సంక్షేమం ఖాతా నుంచి సుమారు రూ.36 లక్షలు డ్రా చేసి వెళ్లాడని, దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సింగరేణిలో రిటైర్డ్ కార్మికులకు సీలింగ్ పది లక్షలు ఇస్తారని, అది ఎత్తి వేయాలని, లాభాల నుంచి బోనస్ 30 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే సింగరేణి కార్మిక ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలుపునకు ప్రతీ ఒక్కరు కలిసి కృషి చేయాలని కోరారు.
 
డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఏమయ్యాయి?
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ప్రజలను మభ్య పెడుతుందని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇంత వరకు ఇవ్వలేదన్నారు. ఉపాధిహామీ పథకంలో పనులు సక్రమంగా లేవని, ఆసరా పింఛన్లు కూడా సరిగా అందడం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో జరిగే అవినీతిని బయట పెడతామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్‌రావు, యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సులేమాన్, నాయకులు సుంకి సత్యం, మందమర్రి, బెల్లంపల్లి ఐఎన్టీయూస్ నాయకులు జె.శంకర్‌రావు, వెంకటస్వామి, గరిగె స్వామి, బాబురావు, లింగయ్య, చంద్రయ్య, శ్రీనివాస్, సూర్యనారాయణ, ఎల్లయ్య, వెంకటస్వామి, భూమయ్య, భిక్షపతి, రాజయ్య ఉన్నారు. 
 
>
మరిన్ని వార్తలు