తప్పుకోకుంటే... తప్పిస్తాం

3 May, 2016 15:40 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలికి హత్యా బెదిరింపులు
పార్టీ అధ్యక్షులకే రక్షణ లేదా అని విమర్శ
 
 
చెన్నై : ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోకుంటే హతమారుస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌కు బెదిరింపు ఎస్‌ఎమ్‌ఎస్ వచ్చింది. చెన్నై విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న తమిళిసై ఆదివారం రాత్రి తన ప్రచారాన్ని ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఒక అజ్ఞాతవ్యక్తి నుంచి ఆమె సెల్‌ఫోన్‌కు ఒక ఎస్‌ఎమ్‌ఎస్ వచ్చింది.

తమిళభాషలో ఉన్న ఎస్‌ఎమ్‌ఎస్‌లో ‘ఈ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించండి, నామినేషన్ వాపసు తీసుకోండి, లేకుంటే మీ కారుపై లారీని ఎక్కించి చంపివేస్తా’మని పేర్కొన్నారు. ఈ బెదిరింపులకు ఆశ్చర్యానికి లోనైన ఆమె వెంటనే పార్టీ అగ్రనేతలకు సమాచారం ఇచ్చారు. తమిళిసై ఫిర్యాదు మేరకు ఎస్‌ఎమ్‌ఎస్ వచ్చిన సెల్‌ఫోన్ నెంబరుపై విరుగంబాక్కం  పోలీసులు విచారణ ప్రారంభించారు.
 
బెదిరేది లేదు: తమిళిసై
ఇలాంటి చవకబారు రాజకీయాలకు, బెది రింపులకు తాను బెదిరేది లేదని తమిళిసై ఈ సందర్భంగా సోమవారం మీడియాతో అన్నా రు. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలికే భద్రతలేకుంటే సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏమిటని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తనకు వచ్చిన ఎస్‌ఎమ్‌ఎస్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నానని అన్నారు.

ఇలాంటి బెదిరింపులకు తాను ఎంతమాత్రం భయపడేది లేదని అన్నారు. ప్రతిపార్టీ అధ్యక్షులకు తగిన బందోబస్తు కల్పించాలని ఆమె ఈసీకి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని అనుసరించి జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక రణరంగం కాకూడద నే ఉద్దేశంతో మాత్రమే తాను ఈసీని కలిసి ఫిర్యాదు చేస్తున్నా, తనకు అదనపు బందోబస్తు కల్పించాలని ఎంతమాత్రం కోరబోవడం లేదని ఆమె స్పష్టం చేశారు.
 
ఈసీ సీరియస్‌గా తీసుకోవాలి: మురళీధరరావు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసైకి హత్యా బెదిరింపులు రావడాన్ని  సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు సోమవారం ఎలక్షన్ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

>
మరిన్ని వార్తలు