మోదీ ముందు 29 డిమాండ్లు ఉంచిన అమ్మ

14 Jun, 2016 17:30 IST|Sakshi
మోదీ ముందు 29 డిమాండ్లు ఉంచిన అమ్మ

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం ఆమె ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

జయలలిత 29 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మోదీకి అందజేశారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని, కావేరి జలవివాదాల పరిష్కారానికి బోర్డు ఏర్పాటు చేయాలని జయలలిత కోరారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో అన్నాడీఎంకే చేరనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించి, జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ వేర్వేరుగా పోటీచేసినా.. ఎన్డీయే ప్రభుత్వంలో అమ్మ పార్టీ చేరవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు