కౌన్సెలింగ్ సమాప్తం

5 Aug, 2014 01:20 IST|Sakshi
కౌన్సెలింగ్ సమాప్తం

 సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సోమవారంతో సమాప్తం అయింది. విద్యార్థుల్లో ఆదరణ కరువు కావడంతో ఈ ఏడాది కళాశాలల్లో లక్ష సీట్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ప్రైవేటు కళాశాల్లో అత్యధిక సీట్లు ఖాళీగా ఉండటం ఆ యాజమాన్యాలను డైలమాలో పడేసింది.రాష్ట్రంలో రానురాను ఇంజినీరింగ్ విద్యపై మక్కు వ తగ్గుతోంది. రెండేళ్లుగా ఈ పరిస్థితి ఎదురవుతోంది. రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ఇంజినీరింగ్ కళాశాలలు పుట్టుకు రావడం ఓ వైపు, సీట్ల సంఖ్య ఏడాదికాఏడా ది పెరగడం మరో వైపు  వెరసి ఇంజినీరింగ్ విద్యకు విద్యార్థులు కరువయ్యేలా చేసింది.
 
 పస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పరంగా 571 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 2,88,486 సీట్లు ఉన్నా యి. వీటిలో ప్రభుత్వ కోటా సీట్లు 2,11,889గా ఉన్నా యి. ఈ సీట్లను అన్నా వర్సిటీ నేతృత్వంలో కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఏడాది దరఖాస్తుల సమయంలోనే ఇంజినీరింగ్‌కు ఆదరణ తగ్గిందన్న విష యం స్పష్టం అయింది. జనరల్ కోటా సీట్లకు లక్షా 70 వేల మంది వరకు దరఖాస్తులు చేసుకున్నా, కనీసం లక్షా నలైభై వేల వరకు సీట్లు భర్తీ అవుతాయన్న ఆశాభావం నెలకొంది. అయితే, విద్యార్థులు ముఖం చాటేయడంతో ఇంజినీరింగ్ ఖాళీల సంఖ్య గత ఏడాది కంటే అధికమయ్యాయి.
 
 సమాప్తం  
 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు గత నెల ఏడో తేదీన అన్నావర్సిటీ శ్రీకారం చుట్టింది. ప్రతి రోజూ ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు కౌన్సెలింగ్ నిర్వహించింది. 28 రోజుల పాటు జరిగిన కౌన్సెలింగ్ సోమవారంతో సమాప్తం అయింది. చివరి రోజు ఉద యం వరకు లక్షా ఏడు వేల మంది విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో సీట్లను ఎంపిక చేసుకుని అడ్మిషన్లు పొందారు. చివరి రోజు సాయంత్రం వరకు అదనంగా మరో రెండు వేల సీట్ల వరకు భర్తీ అయ్యాయి. దీంతో మిగిలిన సీట్లన్నీ ఖాళీగా దర్శనం ఇవ్వక తప్పడం లేదు. లక్ష సీట్లు ఖాళీగా మిగిలాయి. గత ఏడాది 70 వేల వరకు సీట్లు ఖాళీగా మిగలగా, ఈ ఏడాది అదనంగా మరో 30 వేల సీట్లు ఆ జాబితాలోకి చేరాయి. సీట్ల ఖాళీల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, మున్ముందు ఎక్కడ రాష్ట్రానికి ఏఐసీటీఈ కోటాను తగ్గిస్తుందోనన్న బెంగ ఓ వైపు నెలకొంటే, మరో వైపు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి.
 
 విద్యార్థులు కరువు   
 గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చే విధంగా సబర్బన్ ప్రాంతాల్లో విద్యా సంస్థలు పెద్ద ఎత్తున నెలకొల్పారు. ఇందులో కొన్ని ఇటీవలే పుట్టుకొచ్చినవి. ఈ కళాశాలల్లో ప్రస్తుతం ఇంజినీరింగ్‌లోని అనేక కోర్సులకు విద్యార్థులు కరువయ్యారు. దీంతో ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. అన్నావర్సిటీ పరిధిలోని ప్రధాన కళాశాలల్లో కౌన్సెలింగ్ ద్వారా సీట్లన్నీ భర్తీ అయ్యాయి. అలాగే, కొన్ని ప్రధాన ప్రైవేటు కళాశాలల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. అయితే, కొత్తగా పుట్టుకొచ్చిన కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాశాలలకు విద్యార్థులు లేకపోవడం గమనార్హం. సీట్ల సంఖ్యపై కౌన్సెలింగ్ అధికారి రైమండ్ ఉత్తిర రాజ్ మీడియాతో మాట్లాడుతూ,
 
 ఈ ఏడాది లక్ష సీట్లు ఖాళీ గా ఉన్నాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఇతర కోర్సుల మీద దృష్టి పెడుతున్నట్టుందని పేర్కొన్నారు. జనరల్ కౌన్సెలింగ్ సమాప్తం అయిందని, మంగళవారం అనుబంధ కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని తెలిపారు. ఎస్సీ, అరుంధతీయ కోటాలో ఖాళీగా ఉన్న సీట్లు ఈ కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామన్నారు. అలాగే, సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మంగళవారం ఆ విద్యార్థులు దరఖాస్తులు చేసుకుంటే, బుధవారం కౌన్సెలింగ్ ద్వారా సీట్లను కేటాయిస్తామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు