కర్ణాటక బంద్‌ ఎఫెక్ట్‌: స్కూల్స్‌ మూసివేత.. 44 విమానాలు రద్దు

29 Sep, 2023 11:27 IST|Sakshi

సాక్షి, చెన్నై: కావేరి జలాల సమస్య కారణంగా కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం బంద్‌ కొనసాగుతోది. పొరుగున్న ఉన్న తమిళనాడుకు కావేరి నీటి విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అధారిటీ (CWMA) కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ ఒక్కూట రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందుకు దాదాపు 1900 కన్నడ సంఘాలు మద్దతు తెలిపాయి. వీటిలో హోటళ్లు, సినీరంగం, ప్రైవేటు క్యాబ్‌లు, ఆటో సంఘాలు, ప్రైవేటు విద్యాసంఘాలు ఉన్నాయి.

బంద్‌లో భాగంగా నిరసనల్లో పాల్గొన్న వివిధ సంఘాలకు చెందిన 60 మంది ఆందోళనకారులను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని బెంగళూరు రూరల్‌ ఏఎస్పీ మల్లికారం‍రోజున బాలదండి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

కర్ణాటక బంద్‌ ఎఫెక్ట్‌ కెంపేగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుపై పడింది. బంద్‌ కారణంగా రవాణా సౌకర్యాలు దెబ్బతినడంతో శుక్రవారం ప్రయాణించాల్సిన  ఏకంగా 44 విమానాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో 22 విమానాలు బెంగుళూరులో ల్యాండ్‌ అయ్యేవి కాగా మరో 22 విమానాలు ఇక్కడి నుంచి టేకాఫ్‌ కావాల్సినవి ఉన్నాయి. ప్రయాణికులకు సకాలంలో సమాచారం అందించడం ద్వారా వారు తమ టికెట్లను రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్‌ ప్రభావం కొనసాగనుంది. బెంగళూరు నగరంలో పోలీసులు సెక్షన్ 144 విధించారు. ప్రజలు గుంపులుగా బయటకు వచ్చి ర్యాలీలు, నిరసనలు చేపట్టకూడదని, అయిదుగురు కంటే ఎక్కువ మంది సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. 1,900కు పైగా సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి. బెంగళూరుతో సహా రాష్ట్రంలో కిరాణా దుకాణాలు, ఇతర షాప్‌లను మూసేశారు. అయితే ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, ఫార్మసీలు వంటి అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి.

బెంగళూరులో మెట్రో సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి.  మెట్రో స్టేషన్‌ల వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్ణాటక బంద్‌ దృష్ట్యా బెంగళూరులోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు బెంగళూరు డిప్యూటీ కమిషనర్‌ దయానంద కేఏ సెలవు ప్రకటించారు. అనేక విశ్వవిద్యాలయాల్లో పరీక్షలను వాయిదా వేశారు.

కాగా బంద్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర రవాణ బస్సులు, బీఎంటీసీ బస్సులు నడవనున్నాయి. అయితే తమిళనాడు వైపు వెళ్లే బస్సులు నడవకపోవచ్చని, పరిస్థితిని బట్టి మారుతుంటాయని అధికారులు పేర్కొన్నారు. బెంగళూరులోని ప్రధాన రహదారులపై, ముఖ్యంగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పాడే అవకాశం ఉందన్నారు.

ఓలా ఉబర్‌ వంట క్యాబ్‌ యాజమాన్యాలు బంద్‌కు మద్దతునిచ్చాయి. ర్యాలీలో పాల్గొనాలని భావించాయి. ఆటో, రక్షా సంఘాలు కూడా సంఘీభావం తెలిపాయి. 32 ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ కర్ణాటక బంద్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. కర్ణాటక హోటల్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా తన కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది. ఇక శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి సినిమాలను ప్రదర్శించబోమని కర్ణాటక ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 

మరిన్ని వార్తలు