మంత్రి బంధువుల అక్రమ భవనం కూల్చివేయండి

6 Jul, 2013 00:18 IST|Sakshi

ముంబై: నవీ మంబైలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి గణేశ్ నాయక్ బంధువులు అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. నవీ ముంబై సమీపంలో 301 చదరపు మీటర్ల సిడ్కో ప్లాట్‌లో గణేశ్ నాయక్ మేన ల్లుడు అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌సీ గుప్తేలతో కూడిన ధర్మాసనం సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు సందీప్ ఠాకూర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. ‘‘ఎక్సైజ్ మంత్రి గణేశ్ నాయక్, అతని కుమారుడు సందీప్ నాయక్, మేనల్లుడు సందీప్ తండేల్‌లు కలిసి బేలాపూర్‌లో 1.45 లక్షల చదరపు మీటర్ల స్థలాన్ని అక్రమించుకున్నారు. సిడ్కో అభివృద్ధి చేయకూడని ప్రాంతంగా ప్రకటించిన ఈ స్థలంలో మంత్రి మేనల్లుడు ‘గ్లాస్ హౌస్’ పేరుతో బంగ్లా నిర్మించాడు’’ అని హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లాడు.
 
 
 ఈ నిర్మాణానికి సంబంధించిన అన్ని దస్తావేజులను పరిశీలించిన ధర్మాసనం తండేల్ అధికార పూర్వకమైన అనుమతులు లేకుండా అక్రమంగా ఈ భవనం నిర్మించాడని నిర్ధారించింది. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తన విధి నిర్వహణలో విఫలమయింది. చట్టం సమాజంలో అందరికి సమ న్యాయం చేయాలి. అతిఅక్రమణలకు పాల్పడి అక్రమంగా బంగ్లా నిర్మించుకున్న మంత్రి బంధువు పట్ల కార్పొరేషన్ ఎందుకు చర్య తీసుకోలేకపోయిందని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు.  రెండువారాల్లో అక్రమ నిర్మాణాన్ని తొలిగించాలని ధర్మాసనం తండేల్‌ను ఆదేశించింది. కాగా తండేల్ న్యాయవాది కనీసం ఆరువారాల గడువు ఇవ్వాల్సిందిగా కోర్టును కోరగా మురికివాడల వాసులు అక్కడి నుంచి తరలివెళ్లడానికి ఆరుమాసాల గడువు ఇస్తాము. అతిక్రమణ లకు పాల్పడి అక్రమ నిర్మాణాలు చేపట్టినవారికి కాదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నిర్మాణానికి అసలు యజమాని మంత్రి గణేశ్ నాయకా? లేదా తండేలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒక వేళ ఆ భవనం మంత్రిది కానట్లయితే 2011 అక్టోబర్-డిసెంబర్‌ల మధ్య 72 సార్లు ఎందుకు సందర్శించాడని ప్రశ్నించింది.
 
 
 ‘ఆటో, ట్యాక్సీ చార్జీల్ని ఇప్పట్లో పెంచం’
 సమీప భవిష్యత్తులో ఆటో, ట్యాక్సీ చార్జీలను పెంచబోమని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలియజేసింది. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది సందీప్ షిండే... జస్టిస్ డి.వై. చంద్రచూడ్, ఎస్.సి.గుప్తేల నేతృత్వంలోని ధర్మాసనానికి తెలియజేశారు. 2012లో ఆటో, ట్యాక్సీల చార్జీలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలుచేస్తూ ముంబై గ్రాహక్ పంచాయత్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి విదితమే.

మరిన్ని వార్తలు