ఇక సోలార్ ‘పంట’

16 May, 2014 02:48 IST|Sakshi
  • కేబినెట్ ఆమోదం..
  •  పొలాల్లో  సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు
  •  రైతులే ఉత్పత్తిదారులుగా నూతన పాలసీ
  • అనుగుణంగా చట్టంలోనూ మార్పులు
  • ఏడాదికి 450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యం
  •  సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ‘నూతన సోలార్ పాలసీ’ను రూపొందించింది. ఈ విధానంలో పెట్టుబడిదారులతో కలిసి పొలాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను రైతులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా చట్టం (కర్ణాటక ల్యాండ్ రిఫామ్స్ యాక్ట్ సెక్షన్-95)లో కూడా మార్పులు తేవడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి అంగీకారం తెలిపింది.

    కేబినెట్ సమావేశం అనంతరం ఇంధన శాఖ మంత్రి డీ.కే శివకుమార్‌తో కలిసి న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర మీడియాకు వివరించారు. కొత్త పాలసీ ప్రకారం పొలాల్లో రైతు సొంతంగా, లేదా పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఒక రైతు కనిష్టంగా ఒక మెగావాట్ నుంచి గరిష్టంగా మూడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీలుంటుందన్నారు.

    ఈ విద్యుత్‌కు లెక్కగట్టి సంబంధిత విద్యుత్ సరఫరా కంపెనీలు (ఎస్కాంలు)  కొనుగోలు చేస్తాయని చెప్పారు. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి ఐదు ఎకరాల పొలం, గరిష్టంగా రూ.8 కోట్లు అవసరమవుతాయని, ఔత్సాహికులకు బ్యాంక్ ద్వారా రుణాలు లభ్యమయ్యేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. మరోవైపు పెద్ద మొత్తంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి వీలుగా రాష్ట్రంలో సోలార్ పార్కులు ఏర్పాటు చేయనున్నామని, ఒక్కో పార్కు ఏర్పాటుకు వంద ఎకరాలు అవసరమవుతుందని తెలిపారు.  

    ఇందుకోసం ప్రభుత్వ భూమితో పాటు రైతుల భూములను కూడా లీజు విధానంలో తీసుకుంటామన్నారు. నూతన సోలార్ పాలసీకి పరిశ్రమ హోదా దక్కనుందని తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘రూఫ్ టాప్ సోలార్’ విధానాన్ని కొంత సరళీకరించామన్నారు. నూతన విధానం ఈ ఏడాది నుంచి 2021 వరకూ అమల్లో ఉంటుందన్నారు. నూతన పాలసీ విధానంలో ఏడాదికి 450 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం లక్ష్యమన్నారు.
     
    మంత్రి మండలిలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు...
    సాంఘిక సంక్షేమశాఖలో కొత్తగా జూనియర్ వార్డన్ల పోస్టుల ఏర్పాటు

    బెంగళూరు మెడికల్ కళాశాలలో ‘లివర్ టాన్స్‌ప్లాంటేషన్’ ఏర్పాటు, ఏడు పోస్టులు, రూ.5.47 కోట్ల నిధులు

    అధికారుల బదిలీలకు నూతన విధివిధానాలు  

    కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూజర్ చార్జీల పెంపు

    రాష్ట్రంలోని 3,628 గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులకు రూ. 16.32 కోట్లతో ల్యాప్‌ట్యాప్‌లు
     

మరిన్ని వార్తలు