అందరికీ పరీక్ష కనీవిని ఎరుగని భద్రత

12 Apr, 2016 01:47 IST|Sakshi

నేడే పీయూసీ మరు పరీక్ష
లీకుల వ్యవహారంలో  సీఐడీ అదుపులో మరో నలుగురు
స్వయంగా పర్యవేక్షిస్తున్న   మంత్రి రత్నాకర్

 

బెంగళూరు:   పీయూసీ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో అప్రతిష్టను మూటకట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అలాంటి సంఘటన జరకుండా కనీవినీ ఎరుగని భద్రత చర్యలు తీసుకుంది. ద్వితీయ పీయూసీ రసాయన శాస్త్ర మరు పరీక్ష (రీఎగ్జామ్) మంగళవారం జరగనున్న నేపథ్యంలో మరోసారి లీకులకు ఆస్కారం ఇవ్వకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ప్రశ్నపత్రాలకు భద్రతను కల్పించారు. ప్రశ్నపత్రాల రవాణా, పరీక్షల నిర్వహణ తదితర విషయాలన్నింటిని స్వయంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ పర్యవేక్షిస్తుండడం గమనార్హం. ధార్వాడలోని జిల్లా ట్రెజరీ నుంచి పీయూసీ ప్రశ్నపత్రాలను సోమవారం ఉదయం ఆయా జిల్లాల ట్రెజరీలకు రవాణా చేశారు. ఇక్కడి నుంచి సోమవారం సాయంత్రం ఆయా తాలూకా కేంద్రాల్లోని ట్రెజరీలకు చేరనున్నాయి. ఇక ఆయా జిల్లా కేంద్రాలు, తాలూకా కేంద్రాల్లోని ట్రెజరీల్లో ఉన్న ప్రశ్నపత్రాల భద్రతను పూర్తిగా ఎస్పీలకు రాష్ట్ర విద్యాశాఖ అప్పగించింది. ఇక మంగళవారం పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద సైతం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

 
సీఐడీ అదుపులో మరో నలుగురు......

ద్వితీయ పీయూసీ రసాయన శా్రస్త్ర ప్రశ్నపత్రం లీకుల వ్యవహారంలో మరో ఇద్దరు ప్రిన్సిపాళ్లు, కానిస్టేబుళ్లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే సీఐడీ ఆధీనంలో  ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు తుమకూరు ప్రాంతంలో ఈ నలుగురినీ అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దర్యాప్తు పక్కదారి పట్టే అవకాశం ఉండడంతో పాటు భద్రతా కారణాల దృష్ట్యా వీరి వివరాలను వెల్లడించేందుకు సీఐడీ అధికారులు నిరాకరించారు. బెంగళూరులోని ప్రముఖ కళాశాలలకు చెందిన ఈ ఇద్దరు ప్రిన్సిపాళ్లు పోలీసుల సహకారంతో చాలా కాలంగా ప్రశ్నపత్రాల లీకులకు పాల్పడుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నేతల పిల్లలు పరీక్షలు రాసే సమయంలో వారికి ప్రశ్నపత్రాలను అందజేయడంతో పాటు రాష్ట్రంలోని ప్రైవేటు ట్యుటోరియల్స్‌కు సైతం వీరు ప్రశ్నపత్రాలను చేరవేసే వారని సీఐడీ అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు