నాటక రంగ యుగ పురుషుడు రాఘవ

2 Aug, 2013 05:16 IST|Sakshi

తెలుగు నాటకరంగ చరిత్రలో ఒక నూతన శకానికి నాంది పలికిన వైతాళికుడు బళ్లారి రాఘవ. తెలుగు నాటకాన్ని మహోజ్వల మార్గంలో నడిపించిన యుగ పురుషుడు రాఘవ. 19వ శతాబ్దం కన్నడ నాటక రంగంలో దివ్య నక్షత్రం ఒకటి ఉదయించిన భవ్య శతాబ్దం. 1880వ సంవత్సరంలో అష్టావధాని నరసింహాచార్యులు, శేషమ్మ దంపతులకు జన్మించిన కళా బిడ్డే బళ్లారి రాఘవాచార్యులు. కన్నడాంధ్ర నాటక రంగాలలో సమ్మోహన శక్తిగా వెలిగించిన బళ్లారి రాఘవచార్యులు 1880 ఆగస్టు 2న జన్మించారు.
 
 రాఘవచార్యుల మూలనామం ‘బసప్ప’. అనంతరం రాఘవ అని నామకరణం జరిగింది. ఉపాధ్యాయుడైన తండ్రి వద్ద ఇంటి వద్దనే కన్నడం, సంస్కతం, తెలుగు, ఇంగ్లిష్ భాషలలో విద్యాభ్యాసం జరిగింది. మద్రాసు కాలేజీలో విద్యభ్యాసం చేస్తున్న సమయంలోనే రాఘవకు నాటకాల వైపు దష్టి మళ్లింది. విద్యార్థి దశలోనే అనేక ఇంగ్లిషు నాటకాలలో అభినయించే అవకాశం లభించింది. న్యాయశాస్త్ర అభ్యసనం తర్వాత రాఘవ బళ్లారిలోనే నివసిస్తూ నాటకరంగం వైపు దృష్టి సారించారు. తెలుగు మాతృభాష అయినా కన్నడ నాటక రంగం వైపు రాఘవ అడుగులు వేశారు. రాఘవ భక్త రామదాసు, సుభద్ర, చిత్రనళీయము, పాదుకా పట్టాభిషేకం, సారంగధర, సావిత్రి సత్యవాన, తప్పెవరిది?, కింగ్‌లియర్, ఒథెల్లో, హ్యామ్లెట్ (ఇంగ్లిషు) పథ్వీరాజ్, తాళికోట, దీనబంధు కబీర్ (కన్నడ) మొదలైన నాటకాలలో ప్రముఖ పాత్రలు పోషించారు.
 
 విదేశీ పర్యటన :
 అన్నిటి కన్నా విశేషం రాఘవ విదేశీయానం. లండన్‌లో ఆయన ప్రసిద్ధ కవి, తత్వజ్ఞాని బెర్నార్డ్ షాని కలవడం ఒక ప్రముఖ ఘటన. బెర్నార్డ్ షా ఎవరికి ఎక్కువ సమయం కేటాయించేవారు కాదు. అలాంటి వ్యక్తి రాఘవకు రెండు గంటల సమయం ఇచ్చారంటే రాఘవ ప్రతిభ ఏపాటిదో ఊహించవచ్చు. లండన్‌లో ఉన్నపుడు పలువురి సన్మానాలను అందుకొన్న రాఘవ ఇది భారతీయ రంగస్థలానికి జరిగిన సన్మానంగా భావించారు. ప్యారీస్‌లోని అఖిల రంగభూమి సముదాయం రాఘవను ఆహ్వానించగా, అక్కడ భారతీయ నాట్య కళ గురించి అపూర్వమైన ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. రాఘవ ఆంగ్లభాషా పాండిత్యం ఆంగ్లేయులనే విస్తుపరిచింది. మరో ఉపన్యాసం జర్మనీలోని బెర్లిన్‌లో ఇచ్చారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, బర్మా దేశాలను సందర్శించి నాటక రంగం గురించి ప్రత్యేక ఉపన్యాసాలు చేశారు.
 
 చలన చిత్రరంగ ప్రవేశం :
 రాఘవ ద్రౌపదీ మాస సంరక్షణం, రైతుబిడ్డ, చండిక, తప్పెవరిది మొదలైన చిత్రాలలో అభినయించారు. అయితే చిత్రరంగ రాజకీయం ఆయనకు అనువు కాలేదు. నాటకాలలో చూపే సూక్ష్మ అభినయాన్ని సినిమాలలో చూపినా ఇది జనానికి అర్ధం అయ్యేది కాదు. అక్కడ ధనదాహం విసుగు పుట్టించింది. దీంతో చలన చిత్రరంగం నుంచి నిష్ర్కమించారు.
 
 రాఘవ కళామందిరం స్థాపితం :
 రాఘవ అస్తమించిన అనంతరం ఆయనను మరువలేని అతని ఆప్తులు, అభిమానులు, సహనటులు 1946లో రాఘవ స్మారక సమితిని  స్థాపించారు. రాఘవ స్మారక సమితి అవిరళ కృషి ఫలితంగానే బళ్లారిలోని అనంతపురం రోడ్డులో రాఘవ కళామందిరం స్థాపితమైంది. రాఘవ కళామందిరం అభివృద్ధికి అనేక మంది దాతలు ముందుకు వచ్చారు. ప్రతి సంవత్సరం రాఘవ పేరుతో రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులను ప్రదానం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు