సచివాలయంలో 3 లక్షల ఎలుకలు...!

22 Mar, 2018 19:25 IST|Sakshi

ముంబై : సచివాలయంలో మూడు లక్షల ఎలుకలు ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదవాల్సిందే.. మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఎలుకలపై ఆసక్తికర చర్చ జరిగింది. బీజేపీ సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సే  అసెంబ్లీ సమావేశాల్లో... మంత్రాలయంలో(సచివాలయం) ఎలుకల నిర్మూలనకు కాంట్రాక్టు సంస్థ సమర్పించిన బిల్లులలోని లోపాలను ఎత్తి చూపారు. మంత్రాలయంలోని 3,19,400 ఎలుకలు ఉన్నట్టు  కాంట్రాక్ట్‌ సంస్థ చెప్పడంతో వాటి నిర్మూలన కోసం ప్రభుత్వం ఆ సంస్థకు ఆరు నెలల సమయం ఇచ్చిందని గుర్తుచేశారు.

కానీ ఆ సంస్థ కేవలం ఏడు రోజుల్లోనే 3 లక్షల ఎలుకలను చంపినట్టు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని ఖడ్సే తెలిపారు. అసలు మంత్రాలయంలో ఎన్ని గదులు ఉన్నాయి, ఎంత మంది పని చేస్తున్నారు, ఆ స్థాయిలో అసలు ఎలుకలు ఉన్నాయా అంటూ ఆయన తీవ్ర స్థాయిలో కాంట్రక్ట్‌ సంస్థపై మండిపడ్డారు. అలాగైతే రోజుకి ఎన్ని ఎలుకలు చంపారు, ఏ విధంగా చంపారు, చంపిన ఎలుకలను ఎక్కడికి తరలించారో తెలపాలని సదురు సంస్థను ప్రశ్నించారు. సరాసరి రోజుకు 45,628.57 ఎలుకలను చంపారనుకుంటే అందులో 0.57 మాత్రం కొత్తగా పుట్టిన ఎలుక పిల్లలు అయి ఉంటాయని ఖడ్సే అనడంతో సభలోని అందరూ ఒక్కసారిగా నవ్వారు.  

నగరంలోని ఆరు లక్షల ఎలుకలను చంపడానికి బృహన్‌ ముంబాయి మున్సిపల్‌ కార్పోరేషన్‌(బీఎంసీ)కే రెండు సంవత్సరాలు పట్టిందని ఖాడ్సే ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం ప్రభుత్వం నుంచి ఎక్కువ డబ్బులు పొందేందుకే సంస్థ తప్పుడు సమాచారం సమర్పించిందని అన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు